ఇది హన్మకొండలోని అభ్యాసనోన్నత ప్రాథమిక పాఠశాల. ఇక్కడి ఉపాధ్యాయులు, సిబ్బంది... పిల్లలతో కలిసిపోయి ఒక కుటుంబంలాగా ఉంటారు. విద్యార్థులను పుస్తకాల పురుగులుగా తయారు చేయకుండా... వారికి అర్థమయ్యే రీతిలో బోధిస్తారు. కేవలం చదువే కాకుండా... ఇక్కడి పరిసరాలు ఒక ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కలుగజేస్తాయి. అన్ని పాఠశాలల్లా కాకుండా... కొన్నేళ్లుగా ఉపాధ్యాయులందరూ కలిసి దీనిని ఆదర్శంగా తీర్చిదిద్దాలని సంకల్పించి... విజయం సాధించారు.
అన్ని వసతులు ఉండేలా...
లాక్‌డౌన్‌లో విద్యార్థులు, ఉపాధ్యాయులు లేకపోవడంతో పాఠశాలలన్నీ నిర్వహణ లేక దీనస్థితికి చేరింది. ఇక్కడ మాత్రం పాఠశాల పరిసరాలు, తరగతి గదులు, మరుగుదొడ్లు నిత్యం శుభ్రం చేశారు. ఇప్పటికిప్పుడు విద్యార్థులు వచ్చినా... కావాల్సిన అన్ని వసతులు ఉండేలా ఏర్పాట‌్లు చేశారు. ఉపాధ్యాయులు, సిబ్బంది సహకారంతోనే ఇవన్నీ సాధించినట్లు ప్రధానోపాధ్యాయుడు తెలియజేశారు.
400 మంది విద్యార్థులు
ప్రభుత్వ బడిలో అన్ని సౌకర్యాలు ఉండడం, అందులోనూ ఇంగ్లీషు మీడియం కావడంతో విద్యార్థులు పోటీ పడి చేరారు. ఒకటి నుంచి 5వ తరగతి వరకు 400 మంది విద్యార్థులు ఉన్నారు. విద్యార్థులకు ఏ విషయంలోనూ లోటు లేకుండా అన్ని సౌకర్యాలు ఉన్నాయి. లాక్‌డౌన్ సమయంలోనూ ఉపాధ్యాయులు విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఆన్‌లైన్ బోధన సాగించారు.
జీతం లేకున్నా...
ఈ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడితోపాటు 14 మంది ఉపాధ్యాయులు విధులు నిర్వర్తిస్తున్నారు. వీరిలో ఒక్కో ఉపాధ్యాయుడు ఒక్కో తరగతి విద్యార్థులను దత్తత తీసుకొని డిజిటల్ గదిలో కూర్చుని వాట్సప్ ద్వారా పాఠాలు చెబుతున్నారు. విద్యార్థుల సందేహాలను ఆన్‌లైన్ ద్వారానే నివృత్తి చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి జీతం లేకున్నా.. ఉపాధ్యాయులు ఇచ్చే డబ్బులతోనే పాఠశాలను శుభ్రంగా ఉంచుతున్నట్లు ఆయా తెలుపుతోంది.
ఈ పాఠశాలలో పిల్లలపై ప్రత్యేక శ్రద్ధను కనబరుస్తూ.. వారి ఎదుగుదలకు ఉపాధ్యాయులు ఎంతో కృషి చేస్తున్నారు. చదువుతోపాటు వారిని వివిధ రంగాల్లోనూ తీర్చిదిద్దుతున్నారు.
ఇవీ చూడండి: పదిలో ఛాయిస్‌ను మరింత పెంచే అవకాశం!