Kaleshwaram Gravity Canal: భారీ వర్షాలు, వరదల కారణంగా కాళేశ్వరం ప్రాజెక్టులో మరో సమస్య ఏర్పడింది. ఇప్పటికే పంప్‌హౌస్‌లు నీటమునగ్గా... ఇప్పుడు ప్రాజెక్టు కాంక్రీట్ గ్రావిటీ లైనింగ్ ధ్వంసం అవుతోంది. గ్రావిటీ కెనాల్ 6వ కిలోమీటర్ వద్ద 50 మీటర్ల మేర దెబ్బతింది. వారంపాటు ఏకధాటిగా కురిసిన వరదలకు గ్రావిటీ కాలువ పక్కన ఉన్న రహదారి కోతకు గురవ్వటంతో... కెనాల్ కొంతమేర ధ్వంసం అయ్యింది. ఈ ప్రాంతానికి సమీపంలోనే మరో ప్రదేశంలో కాలువ లైనింగ్ దెబ్బతింది. లక్ష్మి పంప్ హౌస్ నుంచి అన్నారం బ్యారేజీ వరకూ... 13.5 కిలోమీటర్ల మేర నీరు పారించేందుకు 800 కోట్ల వ్యయంతో లైనింగ్ నిర్మించారు. రెండేళ్ల క్రితం కూడా గ్రావిటీ కాలువ కోతకు గురైంది. దెబ్బతిన్న లైనింగ్‌కు మరమ్మతులు చేస్తున్నామని అధికారులు తెలిపారు.
కాళేశ్వరం వద్ద క్రమంగా సాధారణ పరిస్ధితులు నెలకొంటున్నాయి. మేడిగడ్డ వద్ద 9 లక్షల 64 వేల క్యూసెక్కుల మేర వరద నమోదవుతోంది. కన్నెపల్లి లక్ష్మి పంప్‌హౌస్‌లో మోటార్లు నీటిలోనే ఉన్నాయి. 40 మెగావాట్ల సామర్థ్యం గల 17 మోటార్లు మునిగిపోయాయి. పంపుల వద్దకు చేరుకునే రెండు లిఫ్టులు వరదలోనే ఉండగా... నష్టం భారీగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. పూర్తిస్థాయి నష్టం ఎంత..? పంప్‌హౌస్ పునరుద్ధరణకు ఎన్ని రోజులు పడుతుందనే విషయంపై స్పష్టతరావట్లేదు. నీటిని తోడేస్తేగానీ పంప్ హౌస్ నష్టం అంచనా తెలీదు.
లక్ష్మి పంపుహౌస్‌కు ప్రస్తుతం ఎవరినీ అనుమతించట్లేదు. మోటార్ల పరిస్థితిని పరిశీలించేందుకు వెళ్లిన మంథని ఎమ్మెల్యే శ్రీధర్‌బాబును పోలీసులు అడ్డుకున్నారు. లోపల మరమ్మతులు జరుగుతున్నాయని ఎవరిని అనుమతించబోమని అధికారులు తెలిపారు. ఇక పుష్కర్ ఘాట్లవద్ద వరద తగ్గింది. మరోవైపు అప్రోచ్ రోడ్డు కొట్టుకుపోవడంతో... మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణ వైపు రాకపోకలు నిలిచిపోయాయి. మేడిగడ్డ బ్యారేజీకి వెళ్లే మార్గంలోనూ రహదారులు దెబ్బతిన్నాయి.
ఇవీ చదవండి: