Inavolu Mallanna temple: ఐనవోలు మల్లికార్జున స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. సంక్రాతి నుంచి ఉగాది వరకు దాదాపు మూడు నెలలపాటు బ్రహ్మోత్సవాలు జరుగనుండగా... చివరి ఆదివారం కావడంతో భక్తులు స్వామివారి సన్నిధికి పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఎత్తుబోనాలు సామూహిక పట్నాలతో భక్తులు మొక్కులు చెల్లించారు. స్థానిక ఎమ్మెల్యే ఆరూరి రమేష్ కుటుంబ సమేతంగా హాజరై స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి.. బలిజ మేడలమ్మ, గొల్ల కేతమ్మ సమేత మల్లన్న కల్యాణ వేడుకలో పాల్గొన్నారు.
కోలాహలంగా మల్లన్న పెద్ద పట్నం..
ఈ రోజు నిర్వహించిన రాష్ట్రంలోనే 40 ఫీట్ల అతిపెద్ద పట్నం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 300 మంది ఒగ్గు పూజారులు తీరొక్క రంగవల్లులతో సుమారు 9గంటలపాటు శ్రమించి పెద్ద పట్నం వేశారు. భక్తులు ఆ పట్నం తొక్కి పులకించిపోయారు. పసుపు బండారి చల్లుకుంటూ తన్మయం చెందారు. శివ సత్తుల పూనకాలు.. మల్లన్న జయజయ నాథాల నడుమ పెద్దపట్నం మహత్తర ఘట్టం అట్టహాసంగా ముగిసింది.
ఇదీ చదవండి:రేపే యాదాద్రి మహాకుంభ సంప్రోక్షణం... యాగ జలాలతో పర్వానికి శ్రీకారం