కరోనా రెండో దశ ప్రజలకు ప్రత్యక్ష నరకం చూపెడుతోంది. మొదటి వేవ్‌లో ఇంట్లో ఒకరికి వైరస్ వచ్చినా... మిగిలిన వాళ్లు సురక్షితంగానే బయటపడ్డారు. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది. ఇంట్లో ఒకరు కొవిడ్ బారిన పడ్డారని తెలుసుకునే లోపే మిగతా కుటుంబ సభ్యులనూ వైరస్ కమ్మేస్తోంది. ఇంటిల్లిపాది కరోనా నిర్ధరణ పరీక్షల కోసం కేంద్రాల వద్ద క్యూ కడుతున్నారు. వైరస్ సోకిందో లేదో తెలుసుకునేందుకు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. రోజువారి పరిమితి దాటిపోయిందనే సమాధానంతో ఉస్సూరుమంటూ వెనుతిరుగుతున్నారు. వరంగల్‌లో కరోనా నిర్ధరణ పరీక్షల కోసం వెళ్తున్న బాధితులకు నిరాశ తప్పడంలేదు. ఉదయం ఏడింటికల్లా క్యూ లైన్లలో ఉంటున్నా పరీక్షలు జరగడంలేదు. ఇవాళ కాదు రేపు రమ్మంటున్నారని.. మరుసటి రోజూ ఇదే పరిస్థితి ఎదురవుతోందని బాధితులు గోడు వెల్లబోసుకుంటున్నారు.
కరోనా టెస్టులు పెంచాం.. లక్షణాలున్నవారందరికీ పరీక్షలు చేయిస్తున్నామని అధికారులు చెబుతున్న మాటలు క్షేత్రస్థాయిలో అమలు కావడంలేదు. ఎంజీఎంకు వెళ్లి పరీక్షలు చేయించుకోండని సలహాలిస్తున్నారని బాధితులు ఆవేదన చెందుతున్నారు.ఎండకు తాళలేక నీరసపడిపోతున్నామని బాధితులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఇంత కష్టపడినా పరీక్షలు చేయకుండానే వెనుదిరగాల్సి వస్తోందని వాపోతున్నారు.
వరంగల్‌లో ఏ కేంద్రానికి వెళ్లినా.. ఇదే పరిస్థితి ఎదురవుతోంది. పరీక్షలు జరగక వైరస్ లక్షణాలు పెరిగిపోతున్నాయని బాధితులు భయాందోళనలకు గురౌతున్నారు. తక్షణమే పరీక్షల సంఖ్య పెంచి మహమ్మారి నుంచి కాపాడాలని వేడుకుంటున్నారు.