వరంగల్ అర్బన్ జిల్లా ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామివారి సంక్రాంతి బ్రహ్మోత్సవాలు కన్నులపండువగా జరుగుతున్నాయి. సంక్రాంతి మొదలు ఉగాది వరకు మూడు నెలలు సాగే మల్లన్న జాతరకు లక్షలాది మంది తరలి వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. ఎత్తు బోనాలు, పెద్దపట్నాలు, ఎడ్లబండ్ల ఊరేగింపు, ఆలయం చుట్టూ ప్రదక్షిణలు నిర్వహించి స్వామి వారికి మొక్కులు సమర్పించుకున్నారు. మల్లన్న బ్రహ్మోత్సవాలకు తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్ నుంచి భక్తులు వస్తారు. శివసత్తుల నృత్యాలు, డోలు చప్పుళ్ల మధ్య ఐనవోలు మల్లన్న జాతర సాగుతోంది. ఈ జాతరలో ఎడ్లబండ్ల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. డోలు వాద్యాలు.. డీజే పాటలతో కుర్రకారు ఉత్సాహంగా ఆడి పాడి కేరింతలు కొట్టారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు జాతర ఏర్పాట్లపై కొంత అసంతృప్తి వ్యక్తం చేయగా మరికొంత మంది భక్తులు ఆనందం వ్యక్తం చేశారు. మళ్ళొచ్చే ఏడాదికి జాతరలో అన్ని సౌకర్యాలు అందుబాటులోకి తేవాలని కోరారు భక్తులు.
తుంగలో నిబంధనలు
జానపదుల జాతరగా పేరుగాంచిన ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి జాతరలో అధికారుల నిర్వహణ వికటించింది. జాతర ప్రారంభానికి పదిహేను రోజుల ముందే పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు జిల్లా స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించినా ఫలితం లేకుండా పోయింది. జాతరలో ఎక్కడ చూసినా... చెత్తచెదారంతో దుర్గంధం వెదజల్లుతోంది. మాస్క్ లేనిదే మల్లన్న దర్శనం లేదని స్వయాన మంత్రి చెప్పినా ఆ దిశగా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తాగునీరు, మరుగుదొడ్లు ఎక్కడున్నాయో తెలియక భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మిషన్ భగీరథ నీళ్లు పుష్కలంగా అందిస్తామని చెప్పి.. కనీసం జాతరలో ఒక్క అధికారి కూడా కనిపించకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని ఐనవోలు వాసులు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. ఐనవోలు ఆలయానికి ముఖ్యమంత్రి కేసీఆర్ మరిన్ని నిధులు కేటాయించి వచ్చే ఏడాదికైనా మెరుగైన వసతులు, సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు.
వీఐపీల సేవలోనే..
జాతర సమీక్ష సందర్బంగా అధికారులు టైం పాస్ చేయొద్దని మంత్రి ఎర్రబెల్లి అన్నప్పటికీ.. అధికార యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరించడం బాధాకరమని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జాతరను పర్యవేక్షించాల్సిన ఈవో నాగేశ్వర్, చైర్మన్ సంపత్ కుమార్ వీఐపీల సేవలో తరిస్తున్నారే తప్ప... సామాన్య భక్తుల బాధలు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొబ్బరికాయలు, పార్కింగ్, పట్నాలు వేయటం ఒక్కటేమిటి.? ఇలా చెప్పుకుంటూ పోతే ఆఖరికి మూత్రం పోయడానికి కూడా డబ్బులు డిమాండ్ చేస్తున్న దుర్భర దృశ్యాలు ఐనవోలు జాతరలో కనిపిస్తున్నాయి. తమ ఇష్ట దైవాన్ని మనస్ఫూర్తిగా దర్శించుకుందామని అనేక వ్యయప్రయాసాలకోర్చి జాతరకొచ్చిన భక్తులు... ఇక్కడి అధికారుల నిర్లక్ష్యం, నేతల పట్ల వారి స్వామి భక్తి ముందు సహనం నశించి వెనుదిరుగుతున్న దృశ్యాలు ఐనవోలు జాతరలో అధికారుల నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది. ఇప్పటికైనా అధికార యంత్రాంగంలో కదలిక వస్తుందా.. అరకొర వసతులతో.. అసంపూర్తిగానే పూర్తవుతుందా అనేది చూడాలి మరి.
ఆరుబయటే..
పేరు గొప్ప.. ఊరు తిబ్బా అన్నట్లు తయారైంది ఐనవోలులో అధికారుల తీరు. కనీస వసతులైన మూత్రశాలలు ఏర్పాటు చేయకపోవడంతో భక్తులు మరీ ముఖ్యంగా మహిళలు ఆరు బయటే మలమూత్ర విసర్జన.. వస్త్రాలు అడ్డుపెట్టుకుని చేస్తున్నారు. జాతరకు వచ్చే భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడొద్దని సాక్షాత్తు రాష్ట్ర మంత్రి ఆదేశాలిచ్చినా.. విస్మరించిన ఆలయ నిర్వాహకులు భక్తులకు సరిపడా శౌచాలయాలు ఏర్పాటు చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఆలయ ప్రాంగణంలో ఉన్న రెండు మూత్రశాలల్లో డబ్బులిస్తే కానీ అనుమతించకపోవడం వల్ల భక్తుల్లో నిరాశ నెలకొంది. అధికారుల నిర్లక్ష్యపు పోకడలతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ఇదీ చూడండి: భక్తుల శరణుఘోష మధ్య మకరజ్యోతి దర్శనం