కేంద్రమంత్రివర్గంలో బీసీ,ఎస్సీ, ఎస్టీలకు ప్రధాని మోదీ ప్రాధాన్యత ఇచ్చారని కిషన్ రెడ్డి తెలిపారు. జన ఆశీర్వాద యాత్రలో భాగంగా ఆయన హన్మకొండకు చేరుకున్నారు. సహాయ మంత్రిగా ఉన్న తనను కేబినెట్ మంత్రిగా నియమించారని చెప్పారు. పర్యటక శాఖ, సంస్కృతక శాఖ, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ తనకు కేటాయించారని తెలిపారు. కేంద్ర మంత్రివర్గంలో 27 మంది బీసీ మంత్రులున్నారని.. 12 మంది ఎస్సీలు, 8 మంది ఎస్టీలు మంత్రులుగా పని చేస్తున్నారని కిషన్ రెడ్డి తెలిపారు.
మోదీ అందరిని మాస్కులు ధరించాలని కోరినట్లు కిషన్ రెడ్డి చెప్పారు. సంవత్సరం నుంచి ఉచితంగా బియ్యం ఇస్తున్నామన్నారు. వరంగల్‌ను పర్యటక కేంద్రంగా మారుస్తామని హామీ ఇచ్చారు. విలువైన ప్రాచీన సంపదకు గుర్తింపు తీసుకురావడంలో... గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహించాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచ దేశాలతో మాట్లాడి.... రామప్పకు యునెస్కో ద్వారా ప్రాచీన వారసత్వ గుర్తింపు తీసుకువచ్చిన ఘనత ప్రధాని మోదీకే దక్కుతందని అన్నారు. ప్రపంచం నలుమూలనుంచి ఇకపైన పర్యాటకులు వరంగల్‌కు వస్తారని అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం స్ధలం కేటాయిస్తే... వరంగల్ విమానాశ్రయం వస్తుందని.. అప్పుడే పర్యాటకులు అధిక సంఖ్యలో రాగలరని తెలిపారు. వేయిస్తంభాల ఆలయంలో కల్యాణమంటపం పనులు తక్షణమే పునరుద్ధరించాలని ఆదేశిస్తున్నట్లు తెలిపారు. సెప్టెంబర్‌లో మళ్లీ వచ్చి పనులను సమీక్షిస్తానని తెలిపారు.
అంతకుముందు హనుమకొండ జిల్లా కేంద్రంలో అమరవీరుల స్థూపానికి కిషన్ రెడ్డి నివాళులర్పించారు. తెలంగాణ అమరవీరుల ఆశయాలను కొనసాగిస్తామని తెలిపారు. అమరవీరుల త్యాగాలకు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలన కొనసాగిస్తున్నారని విమర్శించారు. ఉద్యమ ద్రోహులకు పదవులు ఇస్తూ తెలంగాణ కోసం మాట్లాడిన వారిని పక్కన పెడుతున్నారని అన్నారు.
గతంలో పోలియో వచ్చినప్పుడు 10 సంవత్సరాల తర్వాత టీకా వచ్చింది. కానీ నరేంద్ర మోదీ నాయకత్వంలో కరోనా వచ్చి సంవత్సరం దాటక ముందే కొవిడ్ టీకా వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ తయారూ చేసే ఐదారు కంపెనీల్లో దేశం నుంచి రెండు కంపెనీలు ఉన్నాయి. హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ కొవిడ్ టీకా తయారు చేసింది. ప్రధాన మంత్రి స్వయంగా హైదరాబాద్‌కు వచ్చి ఆ కంపెనీకి వెళ్లారు. వారి భుజం తట్టి అండగా ఉంటామని చెప్పారు. దేశంలో ఉన్న చివరి వ్యక్తి వరకు కరోనా వ్యాక్సిన్ వేయిస్తాం.
-కిషన్ రెడ్డి, కేంద్ర మంత్రి
ఇదీ చదవండి: నలుగురు పిల్లల తల్లితో యువకుడి 'ప్రేమ వివాహం'