గ్రేటర్ పీఠాన్ని ఎలాగైన రెండోసారి కైవసం చేసుకోవాలని పట్టుదలగా ఉన్న తెరాస....అభ్యర్ధుల ఖరారు ప్రక్రియ వేగవంతం చేసింది. ఈసారి అన్ని డివిజన్లలోనూ ఆశావహులు ఎక్కువగా ఉండడంతో..... ఎంపిక పార్టీకి కష్టంగా మారింది. ఒక్కో డివిజన్లో....5 నుంచి 10 మంది ఆశావహలు పోటీ పడ్డారు. పార్టీపరంగా నిర్వహించిన సర్వే, కులసమీకరణాలు మొదలైన అంశాలను ప్రాతపదికలుగా అభ్యర్ధులను ఖరారు చేశారు. శ్రీరామనవమి పండుగ వేళ... 18 మంది అభ్యర్ధులతో తొలి జాబితాను మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు నేతృత్వంలో గ్రేటర్ వరంగల్ సమన్వయ కమిటీ....వెల్లడించింది.
తొలి జాబితాలో ఎక్కువ మంది సిట్టింగ్ అవకాశం ఇచ్చారు. మేయర్ అభ్యర్ధిగా ప్రచారంలో ఉన్న గుండు సుధారాణి 29వ డివిజన్ అభ్యర్ధిగా బరిలో నిలిచారు. 15, 17 డివిజన్లలో తాజా మాజీ కార్పరేటర్లను మార్చి కొత్తవారికి కేటాయించారు. టిక్కెట్ వచ్చినవారు అందరినీ కలుపుకునిపోవాలని... భంగపడిన వారెవరైనా పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే ఊరుకునే ప్రసక్తే లేదని మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు హెచ్చరించారు. తీవ్రమైన పోటీలోనూ టిక్కెట్ దక్కించుకోవడంపై... అభ్యర్ధులు హర్షం వ్యక్తం చేశారు. కచ్చితంగా గెలుస్తామని దీమా వ్యక్తం చేశారు.
ఐదారు రోజులుగా అభ్యర్ధుల ఎంపికపై కసరత్తు చేస్తున్న భాజాపా.... 28 మందితో తొలి జాబితా, 25 మందితో రెండో జాబితా విడుదల చేసింది. మొత్తంగా 53 మంది అభ్యర్థుల ఎంపిక పూర్తిచేసింది. వరంగల్ అభివృద్ధి చేయడంలో భాజపా కీలక పాత్ర పోషించిందని... మరింత ప్రగతి సాధించేందుకు కార్పొరేషన్ ఎన్నికల్లో తమకే అవకాశం ఇస్తారని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేశారు.
నామినేషన్ల ఉపసంహరణ సాయంత్రం తర్వాత... బరిలో ఎందరు నిలుస్తారు... తిరుగుబాటుదారులుగా పోటీ చేసేదెవరనేది స్పష్టమవుతుంది.