భారీ వర్షాలతో ఇప్పటికే అతలాకుతలమైన వరంగల్ ఉమ్మడి జిల్లా ఇంకా తెరుకోకముందే.. మళ్లీ విస్తారంగా వానలు పడుతున్నాయి. వాగులూ వంకలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. చెరువులు సామర్థ్యానికి మించి ప్రవహిస్తూ.. రహదారులను ముంచేస్తున్నాయి.
రెండు రోజుల వ్యవధిలోనే వరుణుడు జోరు పెంచడంతో మరోసారి ఓరుగల్లు జలమయమైంది. సుమారు 10 సె.మీ వర్షపాతం నమోదయింది. రహదారులపైకి భారీగా వరదనీరు వచ్చిచేరింది. పలు కాలనీలు నీటమునిగాయి.
హంటర్ రోడ్.. ఎన్టీఆర్ నగర్, బృందావన కాలనీ, సాయినగర్, సంతోషిమాత కాలనీ, గిరిప్రసాద్ నగర్, రామన్నపేట ప్రియదర్శిని కాలనీ, రఘునాథ్ కాలనీ, భద్రాకాళీ రోడ్, శివనగర్, మైసయ్యనగర్, ఎనుమాముల లక్ష్మీగణపతి కాలనీ, మధురానగర్, టీవీ టవర్ కాలనీ, అమరావతి నగర్, వికాస్ నగర్ కాలనీల చుట్టూ వరదనీరు వచ్చి చేరింది. బొందివాగు, పెద్దమ్మగడ్డ నాలాలు పొంగి పొర్లడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. హుటాహుటిన జేసీబీతో మట్టి, చెత్త తీసి....వరదనీరు త్వరగా పారేందుకు కార్పొరేషన్ అధికారులు చర్యలు తీసుకున్నారు.
నగరంలో 20 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి.. 7,500 మందికి భోజన వసతి కల్పించారు. పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు వరద ప్రాంతాల్లో పర్యటించి....సహాయక చర్యలను పర్యవేక్షించారు. 800 మందిని విపత్తు నిర్వహణ బృందాలు సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. అక్షయపాత్ర తయారుచేసిన ఆహార పొట్లాలను బాధితులకు పంపిణీ చేశారు.
వరంగల్ గ్రామీణ జిల్లా..
కుండపోత వర్షాలకు....వరంగల్ గ్రామీణ జిల్లా వణుకుతోంది. పట్టణ శివార్లలోని కోనారెడ్డి చెరువు కట్ట తెగిపోయింది. ఒక్కసారిగా అందరూ భయాందోళనలకు లోనైయ్యారు. వర్ధన్నపేట పట్టణంలోని కోనాపురం, ఎస్సీ కాలనీ, వంశరాజ్ నగర్, యాదవ కాలనీలను వరదనీరు ముంచెత్తింది. మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు, జిల్లా కలెక్టర్ హరిత, స్థానిక ఎమ్మెల్యే ఆరూరి రమేశ్... ముంపు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కొత్తపల్లి, ల్యాబర్తి గ్రామాల్లోని ప్రజలు.. వరంగల్లోని బంధువుల ఇళ్లకు క్యూకట్టారు. అటు వందలాది ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. రాయపర్తి, సంగెం, పర్వతగిరి, మండలాల్లోనూ చెరువులు, కుంటలు పొంగి ప్రవహిస్తున్నాయి.
ములుగు జిల్లా..
ములుగు జిల్లా వాసులను వరుస వర్షాలు హడలెత్తిస్తున్నాయ్. వాజేడు మండలం పేరూరు వద్ద గోదావరి ప్రవాహం పెరిగింది. వెంకటాపురం - భద్రాచలం మార్గంలో రాకపోకలకు అంతరాయం కలిగింది. ఇక జిల్లాలో రామప్ప చెరువు... సామర్థ్యానికి మంచి ఏడు అడుగుల మేర ప్రవహిస్తోంది. ఫలితంగా వెంకటాపూర్, పాలెంపేట రహదారిని ముంచేసింది. వరద నీరు ఎక్కువగా ప్రవహించేలా చేసేందుకు జేసీబీ ద్వారా గట్టును వెడల్పు చేసేందుకు యత్నించారు. యంత్రం నీటిలో దిగబడిపోయింది. అనంతరం మరో రెండు జేసీబీలతో 10 అడుగుల మేర మత్తడిని పెంచేందుకు మట్టిని తీశారు.
మహబూబాబాద్ జిల్లా..
అల్పపీడన ప్రభావంతో మహబూబాబాద్ జిల్లాలో జోరువానలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. మున్నేరు, రాళ్ల, పాకాల, వట్టి, ఆకేరు, పాలేరు వాగులు... ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. బయ్యారం, గార్ల, కాట్రపల్లి చెరువులు... సామర్థ్యం మించి ఐదారు అడుగులు దాటి ప్రవహిస్తున్నాయి. మహబూబాబాద్ కేసముద్రం.. బయ్యారం- ఇల్లందు, కురవి - ఖమ్మం, గుడూరు -నెక్కొండ, గార్ల.. రాంపురం.. మద్దివంచ, దంతాలపల్లి నుంచి పెద్ద ముప్పారం గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.
మహబూబాబాద్ పట్టణ శివారులో రాళ్లవాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. చిన్న కిష్టాపురానికి చెందిన ఓ గర్భిణి పురిటి నొప్పులతో అవస్థలు పడుతుండగా.. పోలీసుల, రెవెన్యూ సిబ్బంది ఆమెను ఆస్పత్రికి తరలించారు. బయ్యారం పెద్దగుట్టపై ఉన్న పాండవుల జలపాతాన్ని తాత్కాలికంగా మూసివేసి పోలీస్ పహారాను ఏర్పాటు చేశారు. జిల్లాలో ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వాగుల చెంతకు ఎవరూ రాకుండా బారికేడ్లను ఏర్పాటు చేసి కాపలా కాస్తున్నారు. చేపల వేట, వ్యవసాయ పనుల కోసం వాగులను దాటే ప్రయత్నం చేయొద్దని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇవీచూడండి: ఆగని వాన.. ఉమ్మడి వరంగల్ జలమయం!