టీవీలు, సినిమాలు లేని కాలంలో తమ నాటకాల ద్వారా ప్రేక్షకలకు ఆనందంతో పాటు మానసిక ఉల్లాసం అందించారు సురభి కళాకారులు(surabhi theatre group). 136 ఏళ్ల చరిత్ర కలిగిన సురభి సమాజాలు కరోనా కారణంగా ఎన్నో ఇబ్బందులు పడ్డారు. వారి ఇబ్బందులను చూసిన సంగీత నాటక అకాడమీ, తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ చేయూతనిచ్చింది. వారి కోసం హైదరాబాద్‌లో నాటక ప్రదర్శనను ఏర్పాటు చేసింది.
ఏడాది తర్వాత తొలిసారి..
ఏడాది తరువాత ముఖానికి రంగులు వేసుకొని తమ నటన ద్వారా అభిమానులు రంజింపచేశారు. నాటకం కోసం తమ జీవితాలను అంకితం చేసిన సురభి కళాకారుల(surabhi theatre group)ను రక్షించుకోవాల్సిన అవసరం ఉందని ప్రభుత్వ సలహాదారుడు రమణాచారి అన్నారు. టీవీలకు, సినిమాలకు అమ్ముడుపోకుండా నాటకమే ప్రాణంగా జీవిస్తున్నారని పేర్కొన్నారు. సురభి కళాకారులకు ఏడాదికి 20 లక్షల రూపాయలు వచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కళలు అన్న, కళాకారులు అన్న ముఖ్యమంత్రి కేసీఆర్కు ఎంతో ఇష్టమని తెలంగాణ సంగీత నాటక అకాడమీ ఛైర్మన్ శివకుమార్ అన్నారు.
తోటి కళాకారులను కోల్పోయాం..
కరోనా వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవడమే గాక తమ తోటి కళాకారులను కోల్పోయామని సురభి వేణుగోపాల్ అవేదన వ్యక్తం చేశారు. కరోనా చికిత్స కోసం అప్పులు చేశామని తెలిపారు. కొవిడ్ కారణంగా ఏడాది పాటు నాటకాలు ప్రదర్శించలేకపోడం వల్ల ఎన్నో సమస్యలతో సతమతమైనట్లు చెప్పారు. 80 ఏళ్లుగా తాము తెలంగాణ రాష్ట్రంలోనే సంచారం చేస్తూ...నాటకాలు ప్రదర్శిస్తూ జీవనం సాగిస్తున్నామని చెప్పారు.
మానసిక తోడ్పాటు కూడా..
ఇలాంటి కష్టసమయంలో సంగీత నాటక అకాడమీ, భాషా సాంస్కృతిక శాఖ ముందుకు వచ్చిన ప్రదర్శన ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందని సురభి కళాకారులు(surabhi theatre group) అన్నారు. ఈ ప్రదర్శన తమకు ఆర్థికంగానే గాక.. మానసికంగానూ దోహదపడిందని తెలిపారు. రాష్ట్రంలో ఎంతో మందికి సాయం చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ సురభి కళాకారులనూ ఆదుకోవాలని కోరారు.
సురభి నాటకాలు అద్భుతం..
"మేం నాటకాలు ప్రదర్శించేందుకు ఒక స్థలం కేటాయిస్తే అందులోనే థియేటర్ నిర్మించుకుని నాటకాలు ప్రదర్శిస్తాం. నాటకాలపై అభిమానం ఉండి నేర్చుకోవాలనుకే వారికి శిక్షణ కూడా ఇస్తాం. సురభి నాటకాలు ఎంతో అద్భుతంగా ఉంటాయని.. వాటిని చూసేందుకు ప్రతి రోజు రవీంద్రభారతి వస్తున్నట్లు ప్రేక్షకులు చెబుతున్నారు."
- సురభి వేణుగోపాల్, సురభి కళాకారుడు
వాటి కోసమే..
"నాకు సురభి నాటకాలంటే చాలా ఇష్టం. కేవలం వాటిని చూడటానికే నేను విశాఖపట్నం నుంచి ఇక్కడికి వచ్చాను. సురభి కళాకారులను రక్షించుకోవాలి. వారి నాటకాలను బతికించాలి. అప్పుడే కళామతల్లి సంతోషిస్తుంది."
- సాయి, ప్రేక్షకుడు
కళాకారులను రక్షించుకోవాలి..
ఎన్నో శతాబ్దాలుగా నాటక రంగాన్ని నమ్ముకుని జీవిస్తున్న సురభి కళాకారుల(surabhi theatre group)ను రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. వారి నాటకాలు చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపుతున్నారు. సురభి కళాకారులతో ప్రదర్శనలు చేయిస్తే.. దూర ప్రాంతాల నుంచి వచ్చైనా.. చూసేందుకు సిద్ధంగా ఉన్నారు. సురభి కళాకారులు, నాటక సమాజాల పరిరక్షణ కోసం అందరూ కృషి చేయాలి.