Corona Cases in Tenlangana University: నిజామాబాద్ జిల్లాలోని తెలంగాణ యూనివర్సిటీలో కరోనా కలకలం సృష్టించింది. టీయూ వసతిగృహంలో ఉన్న 18 మంది విద్యార్థులకు కరోనా సోకింది. వీళ్లలో అధిక లక్షణాలున్న ముగ్గురు విద్యార్థులను నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. మిగతా 15 మందికి వసతిగృహంలో ప్రత్యేక గదులు ఏర్పాటు చేసి చికిత్స అందిస్తున్నారు. కరోనా సోకిన విద్యార్థుల్లో ఏడుగురు యువతులు కూడా ఉన్నారు.
మరోవైపు రాష్ట్రంలో ఇవాళ మరింతగా కరోనా కేసులు పెరిగాయి. ఇవాళ మొత్తం 36,619 మందికి కరోనా పరీక్షలు చేయగా.. తాజాగా నమోదైన 18 మందితో కలిపి మొత్తం 813 కేసులు నమోదయ్యాయి. కరోనా నుంచి మరో 658 మంది బాధితులు కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 4,703 కరోనా యాక్టివ్ కేసులున్నట్టు అధికారులు తెలిపారు. కేవలం జీహెచ్‌ఎంసీలోనే ఇవాళ 343 కరోనా కేసులు నమోదయ్యాయి.
అటు దేశంలో మాత్రం కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం 14,830 మందికి వైరస్ నిర్ధరణ కాగా.. మరో 36 మంది ప్రాణాలు కోల్పోయారు. కొవిడ్ నుంచి 18,159 మంది కోలుకున్నారు. రికవరీ రేటు 98.47 శాతానికి చేరింది.
ప్రపంచదేశాల్లోనూ కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. కొత్తగా 6,75,085 మంది వైరస్ బారినపడగా.. మరో 1,337 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 575,881,194కు చేరింది. ఇప్పటివరకు వైరస్‌తో 6,404,942 మంది మరణించారు. ఒక్కరోజే 9,64,127 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 54,57,30,530కు చేరింది.
ఇవీ చూడండి: