యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా కొండకింద రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న గండిచెర్లను భక్తులకు అవసరమైన ఏర్పాట్లతో ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దడానికి యాదాద్రి ఆలయ ప్రాధికార సంస్థ (యాడా) ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. కట్టడాలను భక్తిభావం కలిగించేలా నిర్మించడం కోసం పేరొందిన సంస్థలతో చర్చిస్తోంది. యాదాద్రి క్షేత్రాభివృద్ధి పనులను బ్రహ్మోత్సవాల్లోగా పూర్తిచేయాలని సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.
కొండమీద ఆలయాలు, ప్రసాద విక్రయ కేంద్రాలు మాత్రమే ఉంటాయి. దిగువన గండిచెర్ల దగ్గరున్న 90 ఎకరాల్లో యాత్రికులు మొక్కులు తీర్చుకునే ఏర్పాట్లకు, ప్రవచన మందిరాల నిర్మాణాలకు యాడా ప్రణాళికలు తయారు చేస్తోంది. స్వామివారి తెప్పోత్సవం కోసం పుష్కరిణిని రూపొందిస్తున్నారు. పుణ్యస్నానాల కోసం పుష్కరిణిలో ఘాట్లు, పక్కనే దుస్తులు మార్చుకునేందుకు గదులు నిర్మిస్తారు. యాత్రికుల కోసం అల్పాహార, భోజన కేంద్రాలను, తలనీలాల మొక్కుల సమర్పణ కోసం కల్యాణకట్ట ఏర్పాటు చేస్తున్నారు. ఇది 500 మందికి సరిపడేంత విశాలంగా ఉంటుంది.
మండల దీక్ష భక్తుల బస కోసం వందమందికి సరిపడా ప్రత్యేక సముదాయం, సామాన్య భక్తుల బసకు మరొక సముదాయం నిర్మిస్తారు. నిత్యాన్న ప్రసాదం అందించేందుకు వెయ్యిమంది భక్తులకు సరిపడా భవన సముదాయాన్ని నిర్మించేందుకు యాడా ప్రతిపాదనలను సిద్ధం చేసింది. అదే ప్రాంగణంలో బస్‌స్టేషన్ ఏర్పాటుచేస్తారు.
ఇదీ చదవండి: తాగి పడేసిన బోండాలతో సేంద్రియ ఎరువు.. ఎక్కడో తెలుసా..?