యాదాద్రి భువనగిరి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రిలో రోడ్డు విస్తరణ పనులలో భాగంగా.. యాదాద్రి క్షేత్రానికి చెందిన ఆనవాళ్లు కనుమరుగైపోతున్నాయి. ఇందులో భాగంగా యాదవ మహర్షి తపమాచరించిన వృక్షంగా భావిస్తున్న మర్రి చెట్టును తొలగించే పనులు మొదలయ్యాయి. ఈ పరిణామంతో స్థానికులు, క్షేత్ర అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఎలాంటి చర్చలు జరుపకుండా పాత వృక్షాలను తొలగిస్తూ అభివృద్ధి చేయటం, విస్మయానికి దారి తీస్తుందని పలువురు పేర్కొంటున్నారు. యాదవ మహర్షి తపమాచరించినట్లు దేవస్థానమే, గత కొన్ని దశాబ్దాల క్రితం యాదవ మహర్షి విగ్రహాన్ని సదరు మర్రిచెట్టు తొర్రలో ప్రతిష్టించింది. ఇప్పుడు ఇవేమీ పట్టించుకోకుండా వందల ఏళ్ల చరిత్ర కలిగిన వృక్షం నేలకూలే స్థితి వచ్చిందని, ఆనవాళ్లు అంతరించిపోతున్నాయని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
యాదాద్రి అభివృద్ధి పనుల్లో భాగంగా కొండ చుట్ట వలయ రహదారి నిర్మిస్తున్నారు. రహదారి విస్తరణ పనులకు అడ్డంకిగా ఉందనే కారణంతో తులసి కాటేజీలో యాద రుషి కొలువై ఉన్న మర్రిచెట్టు కొమ్మలను వైటీడీఏ అధికారులు తొలగించారు. యాద రుషి తపస్సుకు మెచ్చిన నరసింహ స్వామి ఈ క్షేత్రం యాదగిరిగా విలసిల్లుతుంది అని వరమిచ్చాడు. అంతటి ప్రాముఖ్యం ఉన్న యాద రుషి విగ్రహం ఉన్న మర్రిచెట్టు కొమ్మలను తొలగించటమేంటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.
ఇదీ చూడండి: కేసుల సంఖ్య తగ్గించి చెబుతున్నారు: బండి సంజయ్