టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి రేపు (29న) ఉమ్మడి నల్గొండ జిల్లాలో పర్యటించనున్నారు. వచ్చే నెల 6న వరంగల్‌లో జరగనున్న రాహుల్‌గాంధీ రైతు సంఘర్షణ సభ సన్నాహకాల్లో భాగంగా రేవంత్‌రెడ్డితో పాటు.. టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షురాలు గీతారెడ్డి రానున్నారు. నాగార్జునసాగర్‌లోని విజయ్‌విహార్‌లో జరిగే ఈ సమావేశానికి నల్గొండ, భువనగిరి ఎంపీలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిలతో పాటూ మాజీ మంత్రులు జానారెడ్డి, దామోదర్‌రెడ్డి ఇతర ఉమ్మడి నల్గొండ జిల్లా నేతలకు ఆహ్వానించామని, వారంతా హాజరవుతారని డీసీసీ అధ్యక్షుడు శంకర్‌నాయక్ తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం వరకు పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై సుదీర్ఘంగా చర్చించనున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. నల్గొండ, భువనగిరి పార్లమెంటు పరిధిలో ప్రతి బూత్‌స్థాయి నుంచి దాదాపు 10 మంది కార్యకర్తలు, రైతులు సభకు వచ్చేలా క్షేత్రస్థాయిలో కార్యాచరణ రూపొందించాలని ఇప్పటికే నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాల డీసీసీలకు పీసీసీ ముఖ్యులు ఆదేశించినట్లు తెలిసింది.
విభేదాలు వీడేనా..: షెడ్యూల్ ప్రకారం ఈ నెల 27న నల్గొండలో సన్నాహక సమావేశం జరగాల్సి ఉండగా... నల్గొండ, భువనగిరి ఎంపీలు హాజరుకామని చెప్పడంతో సమావేశం వాయిదా పడింది. దీనిపై పార్టీ చేరికల కమిటీ ఛైర్మన్ జానారెడ్డితో పాటూ మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డితో సహా సీనియర్ నేతలంతా టీపీసీసీ నేతలతో చర్చించి రేవంత్‌రెడ్డి పర్యటనను ఖరారు చేశారని తెలిసింది. ఇద్దరు ఎంపీలతో జానారెడ్డి మాట్లాడటంతో వారూ సమావేశానికి హాజరుకావడానికి సానుకూలంగా స్పందించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. గత కొన్ని రోజులుగా ఉమ్మడి జిల్లాలో రేవంత్‌రెడ్డి వర్గం, ఉత్తమ్, కోమటిరెడ్డి వర్గం ఒకరిపై ఒకరు అధిష్ఠానానికి ఫిర్యాదు చేసుకుంటున్న క్రమంలో ఈ సమావేశంలో నేతలంతా విభేదాలు వీడి పార్టీ బలోపేతానికి చర్చించాలని నాయకులు కోరుతున్నారు.
తాజాగా బుధవారం యాదగిరిగుట్ట మండలంలో స్థానిక నాయకుడు కట్టిన ఓ ఆలయ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ కోమటిరెడ్డి ఇదే కార్యక్రమానికి పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సన్నిహితుడైన టీపీసీసీ అధికార ప్రతినిధి చామల కిరణ్‌కుమార్‌రెడ్డి హాజరుకావడంపై సదరు నాయకుడిని తీవ్రంగా మందలించి అర్థంతరంగా కార్యక్రమం నుంచి వెళ్లిపోయినట్లు సమాచారం. మరోవైపు గత కొన్ని రోజులుగా పార్టీకి అంటిముట్టనట్లు ఉంటున్న మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఈ సమావేశానికి హాజరవుతారా?లేదా అనేది తేలాల్సి ఉంది. ఆయనకూ సైతం నల్గొండ డీసీసీ నుంచి ఆహ్వానం పంపినట్లు తెలిసింది. అయితే ఆయన గత కొంత కాలంగా పార్టీ పరంగా నిర్వహించిన ఏ కార్యక్రమంలోనూ హాజరుకావడం లేదు. దీనికి సైతం ఆయన హాజరు అనుమానమేనని మాజీ మంత్రి ఒకరు వెల్లడించారు. రేవంత్ పర్యటన ఒకవైపు ఖరారు కాగా...మరోవైపు వరంగల్ సభకు భారీగా జనం తరలిరావాలని నల్గొండ ఎంపీ, పీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నల్గొండ పార్లమెంటు పరిధిలోని బ్లాక్, మండల కాంగ్రెస్ అధ్యక్షులతో పాటూ ముఖ్య నాయకులతో బుధవారం జూమ్ మీటింగ్ నిర్వహించి పిలుపునివ్వడం గమనార్హం.
భువనగిరిలో సమావేశం లేనట్లే..: నేడు (గురువారం 28వ తేదీ) భువనగిరిలో జరగాల్సిన యాదాద్రి జిల్లా డీసీసీ సమావేశం రద్దు అయినట్లు తెలిసింది. తొలుత ఈ కార్యక్రమానికి టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డితో పాటూ ఎంపీ కోమటిరెడ్డి హాజరవుతారని తెలిపగా, రేపు సాగర్‌లో రేవంత్‌రెడ్డి పర్యటన దృష్ట్యా ఈ సమావేశం లేనట్లేనని తెలిసింది.
ఇదీ చూడండి:
- సీఐపై ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు.. ఆడియో వైరల్!