RS Praveen Kumar Election campaign in Choutuppal: మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ రెండో విడత బహుజన రాజ్యాధికార యాత్ర చేపట్టారు. ఈ క్రమంలో ఇవాళ యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో పాదయాత్ర నిర్వహించారు. స్థానిక పట్టణ కేంద్రంలోని చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పలు గ్రామాల్లో పాదయాత్ర చేశారు. గత మూడు రోజులుగా చాలా గొప్పగా బహుజన రాజ్యాధికార యాత్ర నడుస్తుందని ఈ రోజు చౌటుప్పల్‌లో కొనసాగుతుందని ప్రవీణ్‌కుమార్ తెలిపారు. మునుగోడు నియోజకవర్గ ప్రజలు ఎప్పుడెప్పుడూ తమ గ్రామాల్లో బహుజన రాజ్యాధికార యాత్ర వస్తుందని ఎదురుచూస్తున్నారని అన్నారు.
'గత 60 నుంచి 70 సంవత్సరాలుగా దొరల పాలనలో ఇక్కడి ప్రజలు నలిగిపోయారు. వాళ్ల భూములు, ఆరోగ్యాన్ని కోల్పోయి.. విషవాయువులను పీలుస్తూ కలుషిత నీరు తాగుతూ జీవనం సాగిస్తున్నారు. ఆ విషపు కోరల్లో నుంచి వచ్చే నీరుతో పండిన పంటనే తింటున్నారు. ఎందరో అనారోగ్యం పాలై ప్రాణాలు కోల్పోతున్నా ఇక్కడి నాయకులెవరూ పట్టించుకోవడం లేదు'అని ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు.
అక్కడి నాయకులందరూ ఫార్మా కంపెనీ యాజమాన్యాలకు అమ్ముడుపోయారని ప్రవీణ్‌కుమార్ ధ్వజమెత్తారు. వారి ఇచ్చే ముడుపులు అందుకొని తమ జీవితాలను నాశనం చేశారనే భావన ఇక్కడి ప్రజలలో నెలకొందని తెలిపారు. యాత్రలో భాగంగా చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలో లైట్ మోటార్స్ వెహికల్స్ సంఘం వాళ్లని కలిసి వారి సాధకబాధకాలను అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో వారు తమకు ఎలాంటి ప్రభుత్వ బీమా అందడం లేదని, టోల్‌గేట్ వద్ద ఎక్కువ ఛార్జీలు వసూలు చేస్తున్నారని ప్రవీణ్‌కుమార్‌కు తెలిపారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయని.. ఎలాంటి నియంత్రణ లేదని తమ బాధను వెల్లబోసుకున్నారు. రాబోయే బహుజన రాజ్యంలో వారి సంక్షేమం కోసం ఒక ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేసి కంటికి రెప్పలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
ఇవీ చదవండి: