తెరాస ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మృతితో జరుగుతున్న నాగార్జునసాగర్ ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం ఏడుగంటలకు పోలింగ్ ప్రారంభం కాగా.... రాత్రిఏడుగంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు 53.3 శాతం ఓటింగ్ నమోదైంది.
ఈవీఎంల మొరాయింపు..
తిరుమలగిరి సాగర్ మండలం తూటిపేట తండాలో ఈవీఎంల మొరాయింపుతో... పోలింగ్ అరగంట ఆలస్యంగా మొదలైంది. గుర్రంపోడు మండలం వట్టికోడులోని 13, త్రిపురారంలోని 265 పోలింగ్ కేంద్రాల్లోనూ ఈవీఎంలు మొరాయించాయి. నాగార్జునసాగర్ హిల్ కాలనీ పోలింగ్ కేంద్రం 100లో ఏజెంట్లు ఆలస్యంగా రావడంతో ఓటింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. ఓటు వేసే ప్రతి ఒక్కరికి గ్లవ్స్‌తో పాటు పోలింగ్ గదిలో శానిటైజర్ అందుబాటులో ఉంచారు. భౌతిక దూరం పాటించేలా జాగ్రత్తలు తీసుకున్నారు.
పరస్పర ఆరోపణలు..
త్రిపురారంలోని 265 బూత్‌లో... 20 నిమిషాలు ఆలస్యమైంది. ఏజెంట్లు సమయానికి రాలేదని అధికారులు... సిబ్బంది సీళ్లు తెరవకపోవడం వల్లే పోలింగ్‌లో జాప్యం నెలకొందని ఏజెంట్లు పరస్పర ఆరోపణలు చేసుకున్నారు. మాడుగులపల్లి మండలం అభంగాపురంలోనూ ఈవీఎంలలో సాంకేతిక సమస్య ఏర్పడింది. తిరుమలగిరి సాగర్ మండలం తూటిపేట తండాలో ఈవీఎం మొరాయించడం వల్ల... అరగంట ఆలస్యంగా ఓటింగ్ మొదలైంది. ఓటింగ్ యంత్రాల్లో సమస్యల వల్ల ప్రజలు... ఉదయం నుంచి పడిగాపులు పడాల్సి వచ్చింది.
1 గంట వరకు 53.3% ఓటింగ్
ఉదయం తొమ్మిదింటి వరకు 12.9 శాతంగా ఉన్న పోలింగ్... 11 గంటల వరకు 31 శాతానికి చేరుకుంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు 53.3 శాతం నమోదైంది.
ఓటేశారు..
తెరాస అభ్యర్థి నోముల భగత్... కుటుంబసమేతంగా అనుముల మండలం ఇబ్రహీంపేటలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. సాగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని పోలింగ్ బూత్‌లో కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి కుటుంబసభ్యులతో కలిసి ఓటువేశారు. త్రిపురారం మండలం పలుగుతండాలో భాజపా అభ్యర్థి రవికుమార్, చింతగూడెంలో తెదేపా అభ్యర్థి అరుణ్‌కుమార్ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
సాగర్‌లో ఈసీ
పైలాన్‌కాలనీ, హిల్‌కాలనీలో పోలింగ్ కేంద్రాలను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్ పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు, సరళిపై ఆరా తీశారు.
మే 2న కౌంటింగ్
సాగర్ ఉపఎన్నికలో 41 మంది అభ్యర్థులు బరిలో నిలవగా.... 2లక్షల20వేల 300 మంది ఓటర్లు ఉన్నారు. సాయంత్రం 6గంటల తర్వాత కరోనా బాధితులకు ఓటువేసే అవకాశం కల్పించనున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటుచేశారు. 108 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక నిఘా ఉంచారు. సాగర్ ఉపఎన్నికకు సంబంధించి మే 2న ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు జరగనుంది.
ఇదీ చదవండి : సాగర్ సమరం : ఓటు వేసిన ప్రధాన పార్టీల అభ్యర్థులు