ఉమ్మడి నల్గొండ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 98.80 శాతం పోలింగ్ నమోదైంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఏడు కేంద్రాలను ఏర్పాటు చేశారు. నల్గొండ జిల్లాలో 3, సూర్యాపేటలో 2, యాదాద్రి భువనగిరిలో 2 పోలింగ్ కేంద్రాలను అందుబాటులో ఉంచారు. తెరాస, కాంగ్రెస్ ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. ఓటర్లను నేరుగా క్యాంపుల నుంచే ఓటు వేసేందుకు తీసుకువచ్చారు.
నియోజకవర్గంలో 1086 మంది ఓటర్లుండగా... ఇంచుమించు అందరూ ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు. నల్గొండ క్లాక్ టవర్ వద్ద ఉదయం స్పల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, నల్గొండ శాసనసభ్యుడు కంచర్ల భూపాల్ రెడ్డి వర్గీయుల మధ్య వాగ్వాదం జరిగింది.
కోదాడలో ఓటేసిన టీపీసీసీ చీఫ్ ఉత్తమ్
కోదాడలోని బాలుర ఉన్నత పాఠశాలలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొత్తం 151 మంది ఓటర్లుండగా... మధ్యాహ్నం 2 గంటల వరకు 148 మంది ఓటింగ్‌లో పాల్గొన్నారు. కోదాడ ఆర్డీవో కిషోర్ కుమార్ పోలింగ్ సరళిని పరిశీలించారు.
యాదాద్రి భువనగిరి జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా సాగింది. ప్రజాప్రతినిధులు ఒక్కొక్కరుగా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన భార్య కచ్చితంగా గెలుస్తుందని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. స్థానిక సంస్థలు ప్రజాప్రతినిధులను తెరాస ప్రభుత్వం హీనంగా చూస్తోందని విమర్శించారు. సర్పంచులు గెలిచినప్పటికీ ఇప్పటికీ చెక్‌పవర్ ఇవ్వలేదని అన్నారు.