పూర్వకాలంలో ప్రకృతి ఒడిలో ఓనమాలు నేర్చుకుని... గురువుల పర్యవేక్షణలో సకల విద్యల్లో ఆరితేరేవారు. అచ్చంగా అలాంటి నమూనాతో రూపుదిద్దుకున్నదే ఉమ్మడి నల్గొండ జిల్లాలోని సర్వేల్ గురుకుల విద్యాలయం. కేవలం తరగతి గదుల్లో మినహా... వసతి గృహాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ పుస్తకాలను అనుమతించరు. వేలాది మందిని ఉన్నత విద్యావంతులుగా.... వందలాది మందిని ఇంజినీర్లు, వైద్యులను సమాజానికి అందించింది ఈ గురుకుల పాఠశాల.
మద్ది నారాయణరెడ్డి దాతృత్వంతో..
బహుభాషా కోవిదుడు పీవీ నరసింహారావు హయాంలో 1971లో... సంస్థాన్ నారాయణపురం మండలం సర్వేలులో గురుకుల పాఠశాల ఏర్పాటైంది. సర్వేలుకు చెందిన సమాజ సేవకుడు, సర్వోదయ నాయకుడు మద్ది నారాయణరెడ్డి దాతృత్వంతో... గురుకుల 44 ఎకరాల సువిశాల ప్రాంగణంలో పీవీ సనరసింహరావు చేతుల మీదుగా మొదలైంది. గ్రామీణ ప్రాంతాలకు చెందిన విద్యార్థులను.. మట్టిలో మాణిక్యాలుగా తీర్చిదిద్దడమే ఈ గురుకులం ప్రధాన లక్ష్యం.
వందశాతం ఉత్తీర్ణత..
పీవీ అంకురార్పణ చేసిన సర్వేలు గురుకులం రాష్ట్రస్థాయిలో మొదటి పది ర్యాంకులు కైవసం చేసుకునేది. వంద శాతం ఉత్తీర్ణతతో పాటు ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాలు, నాయకత్వ పటిమతో అక్కడి విద్యార్థులు మెరికల్లా తయారయ్యేవారు.
సర్వేలు గురుకులంలో విద్యాభ్యాసం చేసిన వారిలో ప్రస్తుత డీజీపీ మహేందర్ రెడ్డి, ఐపీఎస్‌లు మల్లారెడ్డి, ప్రభాకర్‌రావు, నాగిరెడ్డి... ఐఏఎస్‌లు దినకర్ బాబు, శశిధర్, బుర్రా వెంకటేశం, ఎల్.వి.రెడ్డి కీలక బాధ్యతల్లో ఉన్నారు.
పీవీ చేతులమీదుగా మొగ్గ తొడిగిన సర్వేలు గురుకులం విద్యార్థులను భరతజాతి గర్వించే ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడమే ఏకైక లక్ష్యం, దృఢ సంకల్పంతో పనిచేస్తోంది.
ఇవీచూడండి: రాజకీయం- సాహిత్యం రెండు కళ్లలా 'పీవీ' జీవనం