కోతలు ముగిసి పంటంతా కొనుగోలు కేంద్రాలకు చేరుకోగా.. వాటిని ఎప్పుడు కొంటారా అని సాగుదారులు ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పటివరకు తరలించిన సరకును సర్దుబాటు చేయడానికే సమయమంతా పోతోందని... అధికార యంత్రాంగం భావిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో అకాల వర్షాల ప్రభావం గుండెల్లో గుబులును రేకెత్తిస్తోంది. ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలో ప్రస్తుతం 5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కల్లాల్లోనే ఉంది. ఇప్పుడున్న స్థితిలో వర్షానికి గురైతే.. ధాన్యం ఆరడం గగనమే. తేమ శాతం లేదని ఇప్పటికే కొనుగోళ్లు పక్కన పెట్టగా... ఉన్న సరకు సైతం వర్షం బారిన పడితే ఎలా అనే సందేహాలు.. చాలామందిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.
నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల పరిధిలోని పంటంతా... ప్రస్తుతం కొనుగోలు కేంద్రాల్లో ఉంది. నల్గొండ జిల్లాలో 7 లక్షల మెట్రిక్ టన్నుల అంచనాకు గాను.. ఈ నెల 17 నాటికి 5.60 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశారు. వాస్తవానికి వంద శాతం పంట కొనుగోలు చేయడానికి 90 రోజుల గడువు ఉంది. కానీ అకాల వర్షాలు, కరోనా పరిస్థితుల వల్ల.. అంత దాకా ఎందుకన్న ఉద్దేశంతో... కొనుగోళ్లను వేగవంతం చేశారు. కొనుగోళ్లు పూర్తైన 100కు పైగా కేంద్రాలను మూసివేశారు. ఇక సూర్యాపేట జిల్లాలో ఐకేపీ, పీఏసీఎస్ లు కలిపి.. 339 కేంద్రాలకు గాను... 3.90 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించారు. అనుకున్న లక్ష్యంలో ఇంచుమించు అక్కడ కూడా 70 శాతం వరకు కొనగలిగారు. యాదాద్రి జిల్లాలో 292 కొనుగోలు కేంద్రాలకు గాను... 4 లక్షల 80 వేల 827 మెట్రిక్ టన్నులు వస్తుందని అంచనా వేస్తే.. ఇప్పటి వరకు లక్షా 97 వేల 371 మెట్రిక్ టన్నులు సేకరించారు. నల్గొండ జిల్లాలో మరో లక్షన్నర మెట్రిక్ టన్నులు... సూర్యాపేట జిల్లాలో లక్షన్నర మెట్రిక్ టన్నులు... యాదాద్రి జిల్లాలో ఇంకో 2 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం రావాల్సి ఉంది. ఇందులో 90 శాతం మేరకు ప్రస్తుతం కొనుగోలు కేంద్రాల్లోనే ఉంది.
ఈ సీజన్‌లో ఆ పరిస్థితి లేదు..
రైతుల నుంచి ధాన్యం కొని మిల్లర్లకు అప్పగించాక.. సదరు మిల్లుల నుంచి కస్టమ్ మిల్లింగ్ రైస్.. సీఎంఆర్ రూపేణా బియ్యం సేకరించాల్సి ఉంటుంది. ఆ బియ్యాన్ని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎఫ్‌సీఐ సూచనల మేరకు.. వివిధ రాష్ట్రాలకు తరలించే ప్రక్రియ సాగుతుంటుంది. అందుకే ప్రతి సీజన్‌లో ధాన్యం కొనుగోళ్లు మొదలైన కొద్దిరోజులకే.. సీఎంఆర్ కోసం ఎఫ్‌సీఐ జిల్లాల యంత్రాంగాలకు ఆదేశాలిస్తుంటుంది. ధాన్యం తరలిన మిల్లుల నుంచి.. బియ్యం సేకరించే పరిస్థితుల్లో.. సదరు మిల్లుల వద్ద ఖాళీ ఏర్పడుతుంది. తద్వారా మరింత ధాన్యాన్ని ఎప్పటికప్పడు అదనంగా నిల్వ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. కానీ ఈ యాసంగి సీజన్‌లో అందుకు భిన్నమైన పరిస్థితి ఏర్పడింది. అసలు కొనుగోళ్లు ఉంటాయా అనే సందిగ్ధ స్థితి నుంచి... కేంద్రాలు ఏర్పాటు చేసి సరకు సేకరించడం మొదలైనా సీఎంఆర్ పై స్పష్టత లేకుండా పోయింది. అలా కొనుగోళ్లు చేపట్టాక నెల తర్వాత గానీ.. ఎఫ్‌సీఐ నుంచి అంగీకారం లభించలేదు. ఇదే ఇప్పుడు ప్రధాన సమస్యగా మారింది.
గన్నీ సంచుల కొరత లేకుండా, మిల్లుల్లో ధాన్యం నిల్వకు ఇబ్బందులు లేకుండా చూస్తున్నామని అధికారులు చెబుతున్నా... కల్లాల్లోని రైతులు మాత్రం తమ పంట ఎప్పుడు తరలుతుందా అని ఎదురుచూస్తూనే ఉన్నారు.
ఇదీ చూడండి: అడవిలో వైద్యానికి.. ఆమే చుక్కాని...