రాష్ట్రంలో మరోసారి రైతులు రొడ్డెక్కారు. నిన్న నిజామాబాద్, నేడు నాగర్కర్నూల్ ప్రాంతమేదైనా సమస్య రైతన్నదే. నాగర్ కర్నూల్ నియోజకవర్గం తిమ్మాజీపేట మండలంలోని వెల్కిచర్ల, చేగుంట, గోరిట గ్రామాల్లోని సుమారు పదిహేను కుంటలు, చెరువులు నింపితే వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది. ఎన్నో ఏళ్లుగా అధికారులు, నాయకులకు విన్నవించుకున్నా, పట్టించుకునే వారే కరువయ్యారు. అధికారుల నిర్లక్ష్యంమే ఆందోళనకు దారి తీసింది.
ఎందుకు పట్టించుకోరు..?
అధికారుల తీరును నిరసిస్తూ అన్నదాతలు ధర్నాకి దిగారు. రోడ్డుపై వంటావార్పు చేపట్టి నిరసన తెలిపారు. కలెక్టర్ వచ్చి తమ సమస్యకు పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. తమ గ్రామాలకు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న మంగనూరు కాలువల ద్వారా నీరు అందుతున్నా... అవి తమ దాకా రావట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేఎల్ఐ కాల్వ ద్వారా వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామాలకు కూడా నీరందించిన అధికారులు, తమ గురించి మాత్రం ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు.
వ్యవసాయం వదిలేసి...
మూడేళ్లుగా వర్షాలు సరిగా పడక, చెరువులు కుంటలు నిండక, తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని గోడు వెళ్లబుచ్చారు. పశువులకు మేత కూడా అందిచలేకపోతున్నామని కన్నీటి పర్యంతమయ్యారు. వ్యవసాయం వదిలేసి పక్క గ్రామలకు కూలీకి వెళ్లాల్సిన దుస్థితి వచ్చిందన్నారు.
తీవ్ర వాగ్వాదం
అన్నదాతల ఆందోళనతో ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. ఆర్టీసీ బస్సులు, ద్విచక్ర వాహనాలను వేరే దారికి మళ్లించడంతో రైతులకు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. జిల్లా సంయుక్త కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, ఎఎస్పీ జోకుల చెన్నయ్య ఆందోళన చేస్తున్న రైతులతో చర్చించారు. సమస్యను వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
అధికారుల హామీతో రైతులు ఆందోళన విరమించారు. సుమారు ఐదు గంటలకు పైగా సాగిన ఈ ధర్నాలో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది.
ఇదీ చదవండి: 18 తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్