అఫ్గాన్ అల్లకల్లోలంలో మంచిర్యాల జిల్లా కేంద్రానికి చెందిన బొమ్మన రాజన్న చిక్కుకున్నారు. పట్టణానికి చెందిన రాజన్న.. ఎనిమిదేళ్లుగా అఫ్గానిస్థాన్‌లోని ఏసీసీఎల్ సంస్థలో పనిచేస్తున్నారు. జూన్ 28న ఇండియాకు వచ్చిన రాజన్న... ఈ నెల 7న కాబుల్‌కు తిరుగు ప్రయాణం అయ్యారు. ఈలోగా కాబూల్ సహా... దేశమంతా తాలిబన్ల వశమైన నేపథ్యంలో... అక్కడి భయానక వాతావరణం నుంచి బయటపడే మార్గాలన్నీ మూసుకుపోయాయని రాజన్న వాపోయారు. ప్రస్తుతం తనతో పాటు.. కరీంనగర్ జిల్లాకు ఒద్ధారానికి చెందిన వెంకన్న కూడా విధుల్లోనే ఉన్నారని తెలిపారు.
ఈ నెల 18న ఇండియాకు వచ్చేందుకు తమ సంస్థ టికెట్లు సిధ్దం చేసినా.. విమానాలు అందుబాటులో లేవని.. మంగళవారం రాత్రి కుటుంబసభ్యులతో ఫోన్లో తెలిపారు. ఎప్పుడు ఏమి జరుగుతుందోనని భయంగా ఉందని... బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నామని తెలిపారు. తనను సురక్షితంగా స్వగ్రామానికి తరలించేందుకు భారత ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
మరోవైపు.. కొద్ది రోజుల వరకు తమతో ఆనందంగా గడిపిన రాజన్న... భయానక పరిస్థితుల్లో ఇరుక్కుపోయాడని తెలుసుకున్న కుటుంబ సభ్యులు భయాందోళనలో ఉన్నారు. రాజన్నను క్షేమంగా ఇంటికి చేర్చాలని ప్రధాని మోదీతో పాటు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షాను భార్య వసంత, కూతురు రమ్య వేడుకుంటున్నారు.
ఇదీ చూడండి:
అఫ్గాన్‌పై మోదీ కీలక భేటీ- వారిని తీసుకురావాలని ఆదేశం!