ఉమ్మడి పాలమూరు జిల్లాలో పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత తెరాసలో అంతర్మథనం మొదలైంది. మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్ పార్లమెంట్ స్థానాలను తెరాస దక్కించుకున్నా... శ్రేణుల్లో మాత్రం విజయోత్సాహం కనిపించలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో తెరాసకు దక్కిన భారీ ఆధిక్యాలు...ఎంపీ ఎన్నికల్లో దక్కించుకోలేకపోయింది. మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రాతినిధ్యం వహిస్తున్న మహబూబ్‌నగర్‌లో భాజపా అభ్యర్ధి డీకే అరుణకు తెరాస కంటే 4,561 ఓట్లు ఎక్కువగా వచ్చాయి. మంత్రి ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గంలో భాజపా అధిక్యాన్ని ప్రదర్శించడం శ్రేణుల్ని ఆలోచింపజేస్తోంది. డీకే అరుణ సొంత ప్రాంతమైన మక్తల్ నియోజకవర్గంలోనూ... తెరాస కంటే అరుణకు 2వేల ఓట్లు అధికంగా పోలయ్యాయి.
నారాయణపేటలో ఏమైంది..?
నారాయణపేటలోనూ గులాబీ జెండా ఆశించినంతగా ఎగరలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో 15వేలుగా ఉన్న మెజారిటీ ఎంపీ ఎన్నికల్లో 1,211గా మిగిలింది. జడ్చర్ల, దేవరకద్ర నియోజకవర్గాల్లోనూ కారు స్పీడు సగానికి పైగా తగ్గింది. అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్‌లో మాత్రం తెరాసకు 9వేల ఓట్ల మెజార్టీ వస్తే...ఎంపీ ఎన్నికల్లో 22వేల మెజారిటీ దక్కింది. షాద్‌నగర్ శాసనసభ ఎన్నికలో 20వేల ఆధిక్యం రాగా.. ఎంపీ ఎన్నికల్లో 27వేల మెజారిటీ వచ్చింది. ఓ రకంగా చెప్పాలంటే.... షాద్ నగర్, కొడంగల్, జడ్చర్ల నియోజకవర్గాల్లో వచ్చిన అధిక్యాలే మహబూబ్‌నగర్ పార్లమెంట్లో తెరాసను గట్టెక్కించాయి.
ఆశాజనంకంగా...
అసెంబ్లీ ఎన్నికలతో పోల్చితే పార్లమెంట్ ఎన్నికల్లో నాగర్ కర్నూల్ నుంచి తెరాసకు మంచి ఫలితాలే వచ్చాయని చెప్పొచ్చు. పార్లమెంట్ పరిధిలోని అచ్చంపేట, కల్వకుర్తి, కొల్లాపూర్, గద్వాలలో పోతుగంటి రాములుకు అసెంబ్లీ ఎన్నికల కంటే భారీ అధిక్యమే దక్కింది. మంత్రి నిరంజన్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న వనపర్తిలో మాత్రం అసెంబ్లీ ఎన్నికలతో పోల్చితే ప్రస్తుతం గులాబీ గుబాళింపు తగ్గింది. అసెంబ్లీ మెజార్టీ 51వేలు ఉండగా..ఎంపీ మెజార్టీ 27వేలకే పరిమితమైంది. ఆలంపూర్‌లోనూ 44వేలుగా ఉన్న తెరాస అధిక్యం...ఎంపీ ఎన్నికల్లో 14వేలకు పడిపోయింది. అయినా లక్షా 89వేల748 అధిక్యంతో రాములు గెలుపు నాగర్ కర్నూల్లో రికార్డు సృష్టించింది. ఇప్పటి వరకూ నాగర్ కర్నూల్ నుంచి అంతటి మెజార్టిని దక్కించుకున్న నేత మరోకరు లేరు.
కారు.. సారు.. పదహారు నినాదం కూడా ఫలితాల్లో ప్రతిఫలించకపోవడం తెరాసను అంతర్మథనంలో పడేసింది.
ఇవీ చూడండి: రాజకీయాల్లో అహంకారం పనికిరాదు: ఉత్తమ్