మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల, నారాయణపేట జిల్లాలో కురిసిన వానలకు.. మురుగు కాల్వల్లో, లోతట్టు ప్రాంతాల్లో వాన నీరు నిలిచిపోయింది. ఫలితంగా స్థానికులు సీజనల్ వ్యాధుల బారిన పడుతున్నారు. మహబూబ్ నగర్‌లోని వీరన్నపేట, హబీబ్ నగర్, నాగేంద్ర నగర్, ఆదర్శనగర్, మధుర నగర్ లో మురుగు కాల్వల వ్యవస్థ సరిగా లేక.. వాననీరు రోడ్లపైకి చేరుతోంది. నాగర్ కర్నూల్‌లో డ్రైనేజీ కోసం వీధుల్ని తవ్వగా.. వానలకు ఆ గుంతల్లో నీరు నిలిచిపోయింది. రాంనగర్ కాలనీ, శ్రీనగర్ కాలనీ, సంజయ్ నగర్ కాలనీ, హౌజింగ్ బోర్డు, మధురానగర్, పాపయ్య నగర్ కాలనీ, రాహత్ నగర్ అపరిశుభ్రతకు అడ్డాగా మారాయి. సంజయ్ నగర్ కాలనీ, సంతబజార్, బిస్మిల్లాఖాన్ వీధుల్లో దోమలు స్వైర విహారం చేస్తున్నాయి. పారిశుద్ధ్య లోపాల వల్ల.. డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ లాంటి జ్వరాలు జనాన్ని ఆందోళనకు గురి చేస్తున్నాయి.
70 డెంగీ, 14 మలేరియా కేసులు..
కాస్త ఎక్కువగా వర్షాలు కురిస్తే.. జలమయమయ్యే వనపర్తి వీధులు.. నిత్యం కురుస్తున్న వానలతో మురికి కూపాన్ని తలపిస్తున్నాయి. డ్రైనేజీ వ్యవస్థ లేని రాంనగర్ కాలనీ, ఐజయ్య కాలనీ, గాంధీ నగర్ ఇళ్లలోంచి వచ్చే మురుగుతో.. జనాలు ఇబ్బందులు పడుతున్నారు. జంగిడిపురం, శ్వేతనగర్ కాలనీల్లో వాన నీరు నిలిచిపోతుంది. టీచర్స్ కాలనీ, సాయినగర్ కాలనీ, సీడీఆర్ కాలనీల్లో చెత్త.. కుప్పలుగా పేరుకుపోతోంది. సిబ్బంది కొరతతో వారానికి ఒక్కసారే మురుగు కాల్వలు శుభ్రమవుతున్నాయి. జనవరి నుంచి ఇప్పటి వరకూ వనపర్తి జిల్లాలో 70 డెంగీ, 14 మలేరియా కేసులు నమోదయ్యాయి.
అగమ్యగోచరంగా..
కల్వకుర్తి మున్సిపాలిటీలోనూ పారిశుద్ధ్యం అగమ్యగోచరంగా మారింది. తిలక్ నగర్ కాలనీలో మురుగు నీరు పేరుకుపోయి.. స్థానికులు దోమలు, దుర్వాసనతో అల్లాడిపోతున్నారు. కొల్లాపూర్ పురపాలికలో అంబేద్కర్ కాలనీ, ఇందిరా కాలనీల్లో వర్షపు నీరు రోడ్లపైనే నిల్వ ఉంటోంది. చుక్కాయపల్లి కాలనీ, చౌటమెట్లలో మురుగు కాల్వల వ్యవస్థ లేక.. రోడ్లే మురుగు కాల్వలను తలపిస్తున్నాయి.
అమరచింతలోనే 50కిపైగా..
కొత్తగా ఏర్పడిన పురపాలకిల పరిస్థితి మరీ అధ్వాన్నం. ఆత్మకూర్, అమరచింత ప్రధాన రహదారి మినహా ఏ వీధికి వెళ్లినా బురద, చెత్త, దుర్వాసనే. లాక్‌డౌన్ సమయంలో ఒక్క అమరచింతలోనే 50కి పైగా డెంగీ కేసులు నమోదు కాగా.. ఇద్దరు విషజ్వరాలతో మృతి చెందారు. పారిశుద్ధ్య పనులు సక్రమంగా జరగట్లేదని స్థానికులు ఆరోపిస్తుంటే.. సీజనల్ వ్యాధులు రాకుండా.. అన్ని రకాల చర్యలు చేపట్టామని అధికారులు పేర్కొంటున్నారు.
పారిశుద్ధ్యం ప్రశ్నార్థకంగా..
సిబ్బంది కొరత, నిధుల లేమి, పర్యవేక్షణ లోపాలతో జిల్లాల్లో పారిశుద్ధ్యం ప్రశ్నార్థకంగా మారింది. గత ఏడాది..జనవరి నుంచి జూలై వరకూ 85 డెంగీ కేసులు నమోదైతే..ఈసారి ఇప్పటికే 196 కేసులు నమోదయ్యాయి.
ఇవీ చూడండి: పిల్లలపై మానసిక, శారీరక ప్రభావం ఉంటుంది: హైకోర్టు