Alternative Crops: ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టిసారించాలన్న ప్రభుత్వ సూచన మేరకు పాలమూరు జిల్లాలో రైతులు మినుము వైపు మొగ్గుచూపుతున్నారు. రాష్ట్రంలో సాధారణసాగు విస్తీర్ణంతో పోల్చితే ఈ యాసంగిలో 240 శాతం మినుము పంటను అధికంగా సాగుచేశారు. అందులో అధిక విస్తీర్ణం పాలమూరు జిల్లాలోనిదే. మంచి దిగుబడులు, కనీస మద్దతు ధరతో పోల్చితే బహిరంగ మార్కెట్లో అధిక ధర దక్కడం వల్ల ఎక్కువమంది వరికి బదులుగా మినుము ఎంచుకున్నారు. గతంతో పోల్చితే ఈసారి తెగుళ్ల దాడి రైతులను కాస్త ఇబ్బందులకు గురిచేసినా మినుము మంచి ప్రత్యామ్నాయమని భావిస్తున్నారు. విత్తనాల్లో రాయితీ, మార్కెటింగ్, తెగుళ్ల నివారణపై అవగాహన కల్పించి ప్రభుత్వం మినుము రైతులను ప్రోత్సహించాలని కోరుతున్నారు.
యాసంగిలో 58 వేల ఎకరాల్లో సాగు..
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఈ ఏడాది యాసంగిలో మినుము సాగు గణనీయంగా పెరిగింది. వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలవైపు వెళ్లాలన్న వ్యవసాయశాఖ అధికారుల సూచన మేరకు వనపర్తి, నాగర్ కర్నూల్, జోగులాంబ గద్వాల జిల్లాలో రైతులు ఎక్కువమంది మినుము పంట వైపు మొగ్గుచూపారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో మినుము సాధారణ సాగువిస్తీర్ణం 14వేల ఎకరాలు కాగా, ఈ ఏడాది నవంబర్ వరకూ 50 వేల ఎకరాల్లో రైతులు మినుము సాగుచేశారు. మహబూబ్నగర్, నారాయణపేట జిల్లాలు మినహా మిగిలిన ప్రాంతాల్లో ఎక్కువ మంది మినుముపై ఆసక్తి చూపుతున్నారు. 2019 యాసంగిలో 13వేలకే పరిమితమైన సాగువిస్తీర్ణం, గతఏడాది 40 వేలఎకరాలకు చేరింది. ఈ ఏడాది 60వేల ఎకరాలకు చేరుకుంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. పంట నమోదు ప్రక్రియ పూర్తైతే గణాంకాలు తేలనున్నాయి. సాధారణ సాగు విస్తీర్ణంతో పోల్చితే తెలంగాణలో 250 శాతం అధికంగా ఈసారి మినుగు సాగవుతోంది. తెలంగాణలో మినుము సాధారణ సాగువిస్తీర్ణం 24 వేల ఎకరాలు కాగా, 2019లో 16 వేలు, 2020లో 48 వేలు, ఈ ఏడాది యాసంగిలో 58 వేల ఎకరాలు సాగైంది
మినుము లాభదాయకమని..
ఇతర ప్రత్యామ్నాయ పంటలతో పోల్చితే యాసంగిలో మినుము లాభదాయకమని కొన్నేళ్లుగా ఆ పంటను సాగుచేస్తున్న రైతులు అభిప్రాయపడుతున్నారు. మినుగుసాగులో ఎకరాకు 20వేల వరకూ ఖర్చవుతుంది. వాతావరణం అనుకూలించి పంట బాగా పండితే ఎకరాకు 6 నుంచి 12 క్వింటాళ్ల వరకూ దిగుబడి వస్తుంది. కనీస మద్దతుధర కంటే బహిరంగ మార్కెట్లోనే ధర అధికంగా పలుకుతోంది. దీంతో రైతులు లాభాలబాట పడుతున్నారు. గతంతో పోల్చితే ఈసారి తెగుళ్ల దాడి అధికంగా ఉన్న కారణంగా ఎరువుల, పురుగు మందుల పెట్టుబడి పెరిగింది. అయినా దిగుబడి బాగా వస్తే రైతు నష్టపోయే పరిస్థితి ఉండదని చెబుతున్నారు. ప్రభుత్వం వరి వద్దంటున్న నేపథ్యంలో ఇతర ఆరుతడి పంటలతో పోల్చితే మినుము మేలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ప్రభుత్వానికి విజ్ఞప్తి..
ప్రత్యామ్నాయ పంటలు సాగుచేయాలని రైతులకు సూచిస్తున్న ప్రభుత్వం.. అందుకు అవసరమైన విత్తనాలను సరఫరా చేయాలని రైతులు కోరుతున్నారు. ప్రస్తుతానికి బహిరంగ మార్కెట్లో మినుముకు కనీస మద్దతు ధర కంటే అధికధర దొరుకున్నా.. విస్తీర్ణం పెరిగితే ధర పడిపోయే అవకాశం ఉందని రైతన్నలు చెబుతున్నారు. అందుకే ప్రభుత్వమే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి నాణ్యమైన పంటను సరైన ధరకు కొంటామనే భరోసా కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. విత్తనాల్లో రాయితీ, మార్కెటింగ్, తెగుళ్ల నివారణపై అవగాహన కల్పించి మినుము సాగును పెంచి, సాగుదారులను ప్రోత్సహించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇదీచూడండి: Alternative Crops in Telangana: సంప్రదాయ పంటలకు స్వస్తి.. పందిరి సాగుతో లాభాలు మెండు