జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న కారణంతో పలు వార్డులను అధికారులు రెడ్జోన్లుగా ప్రకటించారు. ఈ జోన్లలో జనం బయటకు రాకుండా ప్రధాన రహదారుల్లో పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. అయినా ప్రజలు తమ ఇళ్ల నుంచి బయటకు వస్తున్నారు. ఇటీవల గద్వాలలో పర్యటించిన రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులను ఆదేశించారు. పురపాలిక అధికారులు, పోలీసులు పట్టణంలోని రెడ్జోన్లలో కరోనా పాజటివ్ కేసులు ఉన్న వ్యక్తి ఇంటితోపాటు చుట్టుపక్కల ఉన్న ఇళ్ల ప్రహారీ గేట్లకు తాళాలు వేశారు. వీరికి కావాల్సిన నిత్యావసర సరుకులను తమ సిబ్బందితోసే పంపిణీ చేయిస్తామని చెప్పారు. అధికారుల చర్యలను పలువురు తప్పుపట్టారు. అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారని విమర్శలు వచ్చాయి. ఎవరికైనా ఆరోగ్యపరంగా అత్యవసర పరిస్థితి వస్తే.. బయటకు వెళ్లేందుకు ఇబ్బందులు తలెత్తుతాయని తెలుసుకున్న అధికారులు ఆదివారం సాయంత్రం తాళాలు తీయించారు.
ఈ విషయమై గద్వాల పురపాలక కమిషనర్ నర్సింహ స్పందించారు. కేవలం ఎనిమిది ఇళ్ల గేట్లకు తాళాలు వేశామని, ఇది కేవలం ప్రజలను కంటైన్మెంట్ ప్రాంతాల నుంచి బయటకు రావడానికి నియంత్రించే చర్యల్లో భాగంగా ఒక ప్రయత్నమేనని అన్నారు. తాళాలు వేయడం వల్ల ప్రజలకు ఇబ్బందులు వచ్చే అవకాశమున్నందున ఒక్క రోజులోనే కలెక్టర్ ఆదేశాలతో నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నట్లు చెప్పారు.
ఇవీ చూడండి: గవర్నర్ తమిళిసైతో భాజపా ప్రతినిధుల బృందం భేటీ