మహబూబ్‌నగర్ పట్టణం నడిబొడ్డున పాత కలెక్టరేట్ స్థానంలో రూ.300కోట్లతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం చేపట్టనున్నట్లుగా రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. 10 ఎకరాల్లో నిర్మించనున్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని ప్రజలకు ఉపయోగపడే విధంగా నిర్మిస్తామని మంత్రి తెలిపారు. స్థలాన్ని వైద్యారోగ్య శాఖకు అప్పగించేందుకు సీసీఎల్ఏ అనుమతి సైతం వచ్చిందన్నారు. ఇంజినీరింగ్ అధికారులు భవన నిర్మాణానికి ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని చెప్పారు.
పాత కలెక్టరేట్లోనే 3 ఎకరాల్లో రైతు బజార్ కూడా నిర్మిస్తున్నట్లు మంత్రి వివరించారు. బస్టాండ్ నుంచి నేరుగా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి వచ్చేందుకు రెండు ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు నిర్మిస్తామన్నారు. పట్టణం మొత్తానికి 6 ఫుట్ ఓవర్ వంతెనలు మంజూరైనట్లు తెలిపారు. మహబూబ్‌నగర్‌లో విశాలమైన రోడ్లు, బైపాస్ రహదారులు, శిల్పారామం, పిల్లలమర్రి, మన్యంకొండ, చుట్టూ చెరువులు, పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా సాగు నీరు వస్తే పెద్ద పెద్ద కాలువలతో మణిహారంలా కనిపిస్తుందని అన్నారు.
సంక్షేమ పథకాల్లో ఎవరైనా అవినీతికి పాల్పడినట్లు ఆధారాలతో సహా రుజువైతే కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ను మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆదేశించారు. మహబూబ్ నగర్ పట్టణాన్ని అందంగా తీర్చిదిద్దుతామని, రహదారులపై ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, లిఫ్టులతోపాటు, ఎస్కలేటర్ కూడా ఏర్పాటు చేస్తామని తెలిపారు. అంతకు ముందు జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్లు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, మున్సిపల్ ఇంజినీరింగ్ అధికారులతో కలిసి పాత కలెక్టర్ కార్యాలయ ఆవరణలో ఉన్న డీఆర్డీవో భవనాన్ని, ఇతర పరిసరాలను పరిశీలించారు. డీఆర్డీవో భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్నందున వెంటనే దాన్ని ఖాళీ చేయాల్సిందిగా మంత్రి ఆదేశించారు. ఇప్పుడున్న పెద్ద పెద్ద చెట్లను అలాగే ఉంచాలని, ఆసుపత్రి ప్రతి ఫ్లోర్లో రెండు బ్లాక్‌లు ఏర్పాటు చేసి, లిఫ్టులు, ర్యాంపులు ఏర్పాటు చేయాలని, పార్కింగ్తో పాటు పార్కు ఏర్పాటు చేయాలని సూచించారు.
ప్రజలకు ఎంతో ఉపయోగకరం
'మహబూబ్‌నగర్ పట్టణంలో పెద్ద సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మించనున్నాం. పట్టణం నడిబొడ్డున పాత కలెక్టరేట్ స్థానంలో ఆసుపత్రి నిర్మాణం చేపట్టనున్నాం. బస్టాండ్ పక్కనే ఉండడం వల్ల ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. బస్టాండ్ పక్కనే ఆసుపత్రి ఉండడం వల్ల అంబులెన్స్ కూడా అవసరం లేదు. సీసీఎల్ఏ అనుమతి కూడా వచ్చింది. పక్కనే రైతు బజార్కూడా నిర్మిస్తాం. దాదాపు 250 నుంచి 300 కోట్లు ఖర్చు చేసి పెద్ద ఆసుపత్రి నిర్మాణం చేపట్టనున్నాం. పట్టణంలో 6 ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు కూడా రానున్నాయి. ఫుట్ ఓవర్ బ్రిడ్జిల నిర్మాణ ప్రక్రియ టెండర్ దశలో ఉంది.
-శ్రీనివాస్ గౌడ్, రాష్ట్ర మంత్రి
ఇదీ చదవండి: KTR: తైవాన్ కంపెనీల పెట్టుబడులకు అపార అవకాశాలు: కేటీఆర్