అన్ని రకాల హంగులతో రాష్ట్రంలో 26 కొత్త కలెక్టరేట్లు నిర్మిస్తున్నామని, డిసెంబర్ కల్లా పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామని రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. మహబూబ్‌నగర్‌లో నిర్మిస్తున్న నూతన కలెక్టరేట్ భవనాన్ని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తో కలిసి పరిశీలించారు. ఇటీవల వర్షాలకు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో దెబ్బతిన్న రహదారుల మరమ్మతుల కోసం రూ.80 కోట్ల వరకు త్వరలోనే విడుదల చేస్తామని చెప్పారు.
మహబూబ్ నగర్ నుంచి వికారాబాద్ వెళ్లే రహదారి సమస్యను సైతం త్వరలోనే తీరుస్తామని చెప్పారు. వేముల నుంచి దేవరకద్ర వెళ్లే రహదారి పనులు, బూత్పూర్ నుంచి మహబూబ్‌నగర్ వచ్చే మార్గంలో అసంపూర్తిగా ఉన్న మూడు వంతెనలపై నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. గుత్తేదారుల అలసత్వం ఉంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. నత్తనడకన జరిగే పనులపై హైదరాబాద్‌లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహిస్తామని చెప్పారు.
ఇవీ చూడండి: అబద్ధాల పునాదులపై గెలవాలని భాజపా ప్రయత్నిస్తోంది: హరీశ్‌రావు