Manthri niranjan reddy visit jogulamba: దక్షిణ కాశీ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ పర్వదినాన్ని పురస్కరించుకొని స్వామి, అమ్మవార్లను దర్శించుకునేందుకు భక్తులు వేల సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ ప్రాంతాలు శివ నామస్మరణతో మారుమోగాయి. మహాశివరాత్రి సందర్భంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి కుటుంబ సమేతంగా జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి వార్లను దర్శించుకున్నారు. ఆలయ అధికారులు, అర్చకులు మంత్రికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
మంత్రికి వేద ఆశీర్వచనాలు...
అనంతరం ఆలయంలో నిర్వహించిన హోమం కార్యక్రమంలో మంత్రి నిరంజన్ రెడ్డి, జడ్పీ ఛైర్‌పర్సన్ సరిత, ఎమ్మెల్యే అబ్రహంతో కలిసి కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. తర్వాత లింగోద్భవ వేళ బాలబ్రహ్మేశ్వర స్వామికి అభిషేకం నిర్వహించారు. ఆలయ పండితులు మంత్రికి వేద ఆశీర్వచనం ఇచ్చారు. అలాగే అమ్మవారిని దర్శించుకుని బాలబ్రహ్మేశ్వర స్వామి వారి కల్యాణంలో పాల్గొన్నారు.
ఆకాశ జ్యోతిని చూసేందుకు...
శివ స్వాములు ఆకాశ జ్యోతిని జంగం వీధి నుంచి అలంపూర్ పట్టణ పురవీధుల గుండా ఊరేగింపుగా బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయానికి తీసుకొచ్చి ఆలయం చుట్టూ ప్రదక్షిణ నిర్వహించారు. తర్వాత స్వామివారి ఆలయం పైనుంచి జ్యోతిని నింగిలోకి వదిలారు. ఆకాశ జ్యోతిని చూసేందుకు వేల సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. శివరాత్రి జాగరణ సందర్భంగా ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. దేవస్థానంలో చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరించాయి.
ఇదీ చదవండి:Komuravelli Mallanna Brahmotsavam : కోలాహలంగా కొమురవెల్లి మల్లన్న పెద్దపట్నం