మహబూబ్‌నగర్ జిల్లా దివిటిపల్లిలో నిర్మించిన రెండు పడక గదుల ఇళ్లివి. 2015లో రూ.61.65 కోట్ల అంచనా వ్యయంతో వీటి నిర్మాణం చేపట్టారు. 2018 సెప్టెంబర్‌లో మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ రెండుపడకల గదుల ఇళ్లు ప్రారంభించి రెండేళ్లు గడుస్తున్నా.. ఇప్పటికీ ఎవరికీ కేటాయించలేదు. ఇటీవల కురిసిన వర్షాలకు రెండుపడకల గదుల ఇళ్ల ప్రాంతమంతా పచ్చపడింది. ఇళ్ల చుట్టూ చెట్లు మొలిచాయి. పైకప్పుల పైకి నీరు చేరింది. దూరం నుంచి చూసేందుకు అందమైన ఇళ్లలా కనిపిస్తున్నా.. దగ్గరకు వెళ్తే తప్ప అక్కడి పరిస్థితి అర్థం కాదు. అక్కడక్కడ గోడలకు పగుళ్లు రావడం, కొన్నిఇళ్లు కురుస్తున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.
కేటాయింపులు ఎప్పుడు జరుగుతాయో!
పట్టణంలో సుమారు 11వేల మంది రెండు పడక గదుల ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇళ్ల కేటాయింపులు ఎప్పుడు జరుగుతాయా అని.. వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. 1024 ఇళ్లు పూర్తైనా కేటాయింపులు మాత్రం లేవు. రూ.35 కోట్లతో వీరన్నపేటలో 660 ఇళ్లు నిర్మించగా.. వాటినీ కేటీఆర్ ఇటీవలే ప్రారంభించారు. కొందరికి మాత్రమే వాటిని కేటాయించారు. క్రిస్టియన్‌పల్లిలో మాత్రం 310 ఇళ్లు నిర్మించి అన్నింటినీ అర్హులకు కేటాయించగా వారు నివాసం ఉంటున్నారు. వీలైనంత త్వరగా ఇళ్ల కేటాయింపులు పూర్తి చేయాలని జనం వేడుకుంటున్నారు.
అసలు నిర్మాణమే మొదలు పెట్టలేదు
మొత్తం మహబూబ్‌నగర్ జిల్లాలోనూ.. రెండు పడక గదుల ఇళ్ల పరిస్థితి అలాగే ఉంది. 7,783 ఇళ్లు మంజూరైతే, 2,478 మందికి ఇళ్లు అందించారు. 3,671 ఇళ్లు పూర్తైనా.. వాటిని ఎవరికీ కేటాయించలేదు. 2వేల ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ జరిగింది. 1,634 ఇళ్లు అసలు నిర్మాణమే మొదలు పెట్టలేదు.
నిరుపేదలకు తీవ్ర నిరాశ..
ఉమ్మడి జిల్లాలోని వనపర్తి, నారాయణపేట, నాగర్‌కర్నూల్, జోగులాంబ గద్వాల జిల్లాల్లోనూ రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం, కేటాయింపుల్లో జాప్యం ఇళ్లులేని నిరుపేదలకు తీవ్ర నిరాశకు గురిచేస్తోంది. వచ్చే ఎన్నికలలోపైనా తమకు ఇళ్లు దక్కుతాయా అని ఆశగా ఎదురు చూస్తున్నారు.
ఇవీ చూడండి: కిడ్నాప్ కాదది... ప్రేమ.. డీఎస్పీ ఆఫీస్లో మణిదీపిక