కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ పరిగెత్తుకొస్తోంది. ఆలమట్టిని దాటి నారాయణపూర్ నుంచి దూకుతూ ఇందిరా ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు వైపునకు వెల్లువలా వస్తోంది. ఆదివారం అర్ధరాత్రికి నారాయణపూర్ జలాశయం నుంచి దిగువకు లక్ష క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. భారీగా నీటి విడుదల ఉండటం వల్ల కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లోని కృష్ణా పరీవాహకంలోని ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ఈ ప్రవాహం సోమవారం సాయంత్రానికి లేదా రాత్రికి జూరాల జలాశయాన్ని చేరుకోనుంది. ఆలమట్టి జలాశయంలోకి 88 వేల క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా దిగువకు 98 వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. నారాయణపూర్‌కు 1.02 లక్షల క్యూసెక్కులు వస్తుండగా ఆదివారం అర్ధరాత్రికి దిగువకు లక్ష క్యూసెక్కులను విడుదల చేశారు.
ప్రవాహం పెరిగితే గేట్లు తెరిచే అవకాశం
జూరాల జలాశయంలో ప్రస్తుతం 1.98 టీఎంసీల నీరు ఉంది. 2.88 టీఎంసీలకు చేరుకుంటే ఎత్తిపోతల పథకాలకు నీళ్లు అందుతాయి. ఆ మార్కును చేరుకోగానే నెట్టెంపాడు లిఫ్టుతో ర్యాలంపాడు, గుడ్డెందొడ్డి జలాశయాలకు నీటిని ఎత్తిపోయనున్నారు. కోయిల్‌సాగర్ లిఫ్టుతో ఫర్దీపూర్, కోయిల్‌సాగర్ జలాశయాలను, భీమా-1 లిఫ్టుతో భూత్పూరు, సంగంబండ, భీమా-2 లిఫ్టుతో ఏనుకుంట, శ్రీరంగాపూర్ జలాశయాలను నింపనున్నారు. జూరాల కుడి, ఎడమ కాల్వలకు నీటిని విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఎగువ నుంచి లక్ష క్యూసెక్కుల ప్రవాహం కొనసాగితే జూరాల నుంచి మంగళవారం దిగువకు నీటి విడుదల ప్రారంభించనున్నారు. 48 వేల క్యూసెక్కులను విడుదల చేసి 240 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేయనున్నారు. దిగువ జూరాల యూనిట్లు కూడా ఉత్పత్తికి సిద్ధంగా ఉన్నాయి. ప్రవాహం పెరిగితే ప్రాజెక్టు గేట్లు తెరిచే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడి నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు నాలుగురోజుల్లో వరద చేరుకునే అవకాశాలు ఉన్నాయి.
ఇవీ చూడండి: కాంగ్రెస్ నేత ముఖేష్ గౌడ్ ఆరోగ్య పరిస్థితి విషమం