2021-22 ఆర్థిక సంవత్సరానికి కేంద్రం ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్.. ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజలను నిరాశ పరిచింది. కొత్త రైలు మార్గాల ఊసే లేదు. గతంలో సర్వే చేసిన రైలు మార్గాల ప్రస్తావన సైతం లేదు. కొవిడ్ మూలంగా దేశ ఆర్థిక వ్యవస్థ.. కాస్త ఇబ్బందుల్లో పడ్డ నేపథ్యంలో కేంద్రం కొత్తవాటికి జోలికి వెళ్లకుండా ఉన్న ప్రాజెక్టులకే నిధులు కేటాయించడానికి ఎక్కువ ప్రాధాన్యమిచ్చినట్లు తెలుస్తోంది. ఈ సారి బడ్డెట్‌లో సికింద్రాబాద్ - మహబూబ్‌నగర్ డబ్లింగ్ పనులకు 100 కోట్ల రూపాయలు కేటాయించారు. గత ఏడాదితో పోల్చితే ఈ నిధులు తక్కువ. గతేడాది ఇదే డబ్లింగ్ పనుల కోసం.. 185 కోట్ల రూపాయలు కేటాయించారు. ప్రస్తుతం డబ్లింగ్ పనులు కొనసాగుతున్నాయి.
ఏడాదికల్లా డబ్లింగ్ పూర్తి..
సికింద్రాబాద్ - మహబూబ్‌నగర్ డబ్లింగ్, విద్యుదీకరణ పనులు 2015-16లో మంజూరయ్యాయి. 85 కిలోమీటర్ల దూరానికి 744 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో.. పనులు ప్రతిపాదించారు. మొదటి ఏడాది 27 కోట్ల రూపాయులు.. 2016-17లో 80 కోట్లు.. 2017-18లో 50 కోట్లు.. 2018-19లో 250 కోట్లు, 2019-20లో 200 కోట్లు, 2020-21లో 185 కోట్ల రూపాయలు కేటాయించారు. ప్రస్తుతం షాద్‌నగర్ నుంచి గొల్లపల్లి వరకూ... డబ్లింగ్ పూర్తైంది. ఏడాది కల్లా పూర్తి చేయాలని.. రైల్వే అధికారులు ముందుకు సాగుతున్నారు.
గతం కంటే తక్కువే..
దేవరకద్ర - మునీరాబాద్ మార్గానికి ఈ ఏడాది బడ్జెట్‌లో 149 కోట్ల రూపాయలు కేటాయించారు. 1997-98 లో 244 కిలోమీటర్ల రైలు మార్గాన్ని.. 1,723 కోట్లతో చేపట్టేందుకు పనులు ప్రతిపాదించారు. తెలంగాణలో 66 కిలోమీటర్ల రైలు మార్గం ఉంది. ఇప్పటికి 40 కిలోమీటర్లు పూర్తైంది. కృష్ణా - మక్తల్ మధ్య 26 కిలోమీటర్ల పనులు కొనసాగుతున్నాయి. 2015-16లో 15 కోట్లు కేటాయించగా.. ఆ తర్వాత వరుసగా 300, 275, 275, 240 కోట్లు కేటాయించారు. ఈసారి మాత్రం 149 కోట్ల రూపాయలతో సరిపెట్టారు. గత కేటాయింపులతో పోల్చితే దాదాపు 90 కోట్లు తక్కువ.
కాస్త ఊరట..
గద్వాల- రాయచూర్ మార్గం విద్యుదీకరణకు 18కోట్లు కేటాయించడం కాస్త ఊరటనిచ్చే అంశం. 2018-19లో 46కోట్లు కేటాయించారు. ఆ తర్వాత ఈ మార్గానికి కేటాయింపులు దక్కలేదు. మళ్లీ ఇప్పుడు నిధులు కేటాయించడం కొంత ఊరటనిస్తోంది. ఇక గతంలో సర్వే జరిగిన గద్వాల- మాచర్ల , వికారాబాద్- కృష్ణా, నాగర్ కర్నూల్ మీదుగా కర్నూలు వెళ్లేందుకు వీలుగా జడ్చర్ల - నంద్యాల రైలు మార్గాల ఊసే.. బడ్జెట్‌లో కనిపించలేదు. రైల్వే స్టేషన్లు ఆధునీకరణ, రైళ్ల నిలుపుదల ప్రతిపాదనలు.. అమలుకు నోచుకోలేదు.
- ఇదీ చూడండి : రాష్ట్ర వార్షిక బడ్జెట్ కసరత్తు వేగవంతం