పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో జరిగిన పునరాకృతితో పాటు కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పంప్‌హౌస్ ప్రమాద ఘటనపై సీబీఐ చేత విచారణ జరిపించాలని ఏఐసీసీ కార్యదర్శి వంశీ చంద్‌రెడ్డి డిమాండ్ చేశారు. పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మిస్తున్న ఉపరితల పంపుహౌస్‌ను భూగర్భ పంప్ హౌస్‌గా మారిస్తే.. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పంప్ హౌస్‌కు ప్రమాదం ఉండటమే కాకుండా... సుమారు వెయ్యి కోట్లు అదనంగా ఖర్చవుతుందని నాలుగు రకాల కమిటీలు నివేదికలు ఇచ్చినా కూడా ప్రభుత్వం కమిషన్‌లకు కక్కుర్తి పడిందని ఆరోపించారు.
ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వంశీచంద్‌రెడ్డి పాల్గొన్నారు. 2016 అక్టోబర్ 28న మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ 690 ఎకరాల భూమి ఎత్తిపోతల పథకానికి బదిలి చేసినా.. 18 నవంబర్ 2016 న భూసేకరణ జరగని కారణంగా భూగర్బ పంప్‌హౌస్ నిర్మాణం చేపట్టేందుకు పునరాకృతి చేశారన్నారు.
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పనులపై ఆనాడు శాసనసభలో హెచ్చరికలు జారీ చేసినా.. జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు భేఖాతరు చేశారని మండిపడ్డారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకంపై వ్యంగంగా మాట్లాడిన జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు ఇప్పుడు క్షమాపణలు చెప్పాలని.. తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.