అనుబంధాలు, అనురాగాల పొదరిల్లు... ఉమ్మడి కుటుంబాలు. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాల కలయిక చూడముచ్చటగా ఉండేది. అనురాగాలు, ఆప్యాయతలకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచేవి. ప్రస్తుతం కాలం మారింది. మనుషులు, మనసుల మధ్య అంతరం పెరిగింది. ఒక్కో నగరంలో ఒక్కక్కరు ఉంటూ శుభకార్యాలకు కలవడమూ గగనంగా మారింది. దగ్గరి బంధువుల్లోనూ ఎవరికీ ఎవరు ఏ వరసవుతారో తెలియని దుస్థితి. ఖమ్మం జిల్లాకు చెందిన కుతుంబాక కుటుంబానికి మాత్రం సంక్రాంతి ఏటా చెప్పలేని అనుభూతుల్ని మోసుకొస్తుంది.
ఆత్మీయ కలయిక
ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం వి.వెంకటాయపాలెం గ్రామానికి చెందిన పోలీస్ పటేల్ కుతుంబాక రామయ్య, బాపమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు, ఏడుగురు కుమార్తెలు ఉన్నారు. వారి సంతానం, వారసులు మొత్తం నాలుగు తరాల వారంతా ఏటా సంక్రాంతి పండగకు ఒకేచోట కలవడం ఆనవాయితీగా వస్తోంది. నాలుగేళ్లుగా ఉమ్మడి కుటుంబానికి చెందిన దాదాపు 150 మంది వారసులంతా ఆత్మీయ కలయిక ఏర్పాటు చేసుకుంటున్నారు. రామయ్య, బాపమ్మ దంపతులు వీరి కుటుంబానికి దూరమైనా వారి జ్ఞాపకాలు నెమరేసుకుంటూ ఉమ్మడి కుటుంబం అనురాగ ఆప్యాయతలు పంచుకుంటున్నారు.
ఏడాదంతా సామాజిక మాధ్యమాల్లోనే..
నాలుగేళ్ల క్రితం బాపమ్మ కుటుంబం ఓ వాట్సాప్ గ్రూప్ ఏర్పరుచుకున్నారు. అప్పుడు ఓ ఆత్మీయ కలయికపెట్టి అప్పటి నుంచీ కొనసాగిస్తున్నారు. ఏటా సంక్రాంతికి అందరూ ఒక్కచోట చేరి... పిల్లా, పాపలతో సందడి చేస్తారు. ఆ తర్వాత మళ్లీ ఏడాదిపాటు వాట్సాప్ గ్రూపులో ఆ మధుర జ్ఞాపకాలను పంచుకుంటూ మరో సంక్రాంతి కోసం ఎదురుచూస్తుంటారు. కరోనా కారణంగా ఈసారి కొంతమంది బంధువులు రాలేకపోయారన్న బాపమ్మ కుటుంబ సభ్యులు వచ్చే ఏడాది మరింత ఘనంగా పండుగ జరుపుకుంటామని చెబుతున్నారు.
ఇదీ చూడండి: పందెంలో ఏ కోడి ఎప్పుడు గెలుస్తుంది.. కోడిశాస్త్రం ఏం చెబుతోంది!