ఆర్బీఐ ప్రకటించిన మారటోరియం ఆగస్టు 31తో ముగియనున్న నేపథ్యంలో మరో నాలుగు నెలల పాటు లోన్‌పై మారటోరియంను, ఇన్సూరెన్స్‌ను పొడిగించాలని తెలంగాణ లారీ ఓనర్స్ అసోసియేషన్ నాయకులు తెరాస లోక్‌సభా పక్ష నేత నామ నాగేశ్వరరావుకు వినతిపత్రం అందజేశారు. లారీ ఓనర్స్ అసోసియేషన్ విజ్ఞప్తిపై తక్షణమే స్పందించిన ఎంపీ.. కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ రాశారు.
కొద్ది నెలలుగా అంతర్రాష్ట్ర రవాణా నిలిచిపోయిందని, ఈ ప్రభావం రోడ్డు రవాణా రంగంపై తీవ్రంగా పడిందని, లాక్డౌన్ కారణంగా రవాణా రంగం తీవ్ర అనిశ్చితిలో ఉందని లేఖలో పేర్కొన్నారు. లాక్డౌన్ కారణంగా కిరాయి లేక, పెరుగుతున్న అప్పుల భారం భరించలేక.. లారీ యజమానులు ఆర్ధికంగా చితికిపోయారని వివరించారు. ఆర్ధిక కార్యకలాపాలు మందగించడం, ఇప్పట్లో పుంజుకుంటుందనే ఆశాభావం లేకపోవడంతో ఫైనాన్షియర్లకు వాహనాలు అప్పగించే దిశగా లారీ యజమానులు ఆలోచన చేస్తున్నారని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో మారటోరియం, ఇన్సూరెన్స్‌ను డిసెంబర్ 31వరకు పొడిగించాలని నిర్మలా సీతారామన్‌ను ఎంపీ నామ నాగేశ్వరరావు కోరారు.