ప్రజలంతా పట్టుబట్టి, జట్టుకట్టి మొక్కలను పెంచితే... అవి జీవితాంతం మనల్ని కాపాడుతాయని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో కలెక్టర్ ఆర్వీ.కర్ణ్, ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యతో కలిసి బేతుపల్లి చెరువు కట్టపై మొక్కలు నాటారు. పల్లెల్లోకి ఆక్సీజన్ సిలిండర్లు రాకముందే ప్రజలంతా మేల్కొని హరితహారాన్ని యజ్ఞంలా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు.
గతంలో విచక్షణా రహితంగా అడవులను నరికివేయడం వల్లే... వాతావరణ సమతుల్యత దెబ్బతిందన్న మంత్రి.. మొక్కలు నాటడమే కాకుండా వాటి సంరక్షణ బాధ్యతను కూడా తీసుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
పట్టణాల్లోనూ చిట్టడవులు..
బేతుపల్లి చెరువుకట్ట చుట్టూ తిరిగిన మంత్రి... వాతావరణం ఆహ్లాదకరంగా ఉందని అధికారులను ప్రశంసించారు. అనంతరం పెనుబల్లి మండలం, తల్లాడ మండలంలో పలుచోట్ల మొక్కలు నాటారు. సత్తుపల్లి అర్బన్ పార్కును సందర్శించిన పువ్వాడ.. పార్క్ అభివృద్ధికి మరింత కృషి చేయాలని అధికారులను సూచించారు. పట్టణాల్లోనూ చిట్టడవులు పెంచేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఇవీ చూడండి: తొక్కలోనూ పోషకాలు.. ఇలా వండుకుంటే అదిరిపోద్ది!