పట్టణాలు, నగరాల్లో స్థానిక పాలనను బలోపేతం చేయడమే కాకుండా.. ప్రజల కనీస అవసరాలు తీర్చడం కూడా దృష్టి సారించాలని పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ సూచించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని నగర, పురపాలికల అభివృద్ధి పనులపై రవాణశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌తో కలిసి కేటీఆర్ సమీక్షించారు. పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, పచ్చదనంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలన్న మంత్రి... అన్ని పట్టణాల్లో అర్బన్ లంగ్‌స్పేస్, పార్కులు అభివృద్ధి చేయాలని ఆదేశించారు.
రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త పురపాలక చట్టం దేశంలోనే గొప్పచట్టమని, ప్రపంచంలోని మంచి చట్టాల్లో ఒకటని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. పట్టణాలకు సరిపడా కనీస అవసరాలు తీర్చడమే ప్రభుత్వ లక్ష్యమన్న మంత్రి.. అన్ని మున్సిపాల్టీల్లోనూ వనరుల, పారిశుద్ధ్య ఆడిటింగ్ చేపట్టాలని స్పష్టం చేశారు. పచ్చదనం పెంపుపై పట్టణాల మధ్య పోటీ ఉండాలని సూచించారు. మున్సిపాలిటీల్లో త్వరలోనే సిబ్బంది నియామక ప్రక్రియ చేపడతామని, స్థానిక అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులను ప్రాధాన్యతా క్రమంలో ఎంచుకోవాలని వివరించారు. ఖమ్మం కార్పొరేషన్‌లో త్వరలోనే విపత్తు స్పందన బృందాన్ని ప్రారంభిస్తామని కేటీఆర్ తెలిపారు.
ఇవీ చూడండి: కానిస్టేబుల్ ప్లాస్మా దానం.. అభినందించిన కేటీఆర్