ఖమ్మం పార్లమెంటరీ నియోజకవర్గంలో తెరాస ఘన విజయాన్ని సాధించింది. కాంగ్రెస్ పార్టీ స్థానిక నేత, మాజీ ఎంపీ రేణుకా చౌదరిని బరిలోకి దించినా నామ నాగేశ్వరరావు గెలుపును అడ్డుకోలేకపోయింది.
అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించిన తెరాస ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాత్రం కేవలం ఒక్క స్థానంలో మాత్రమే గెలిచింది. మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెస్ నుంచి గెలిచిన పాలేరు, కొత్తగూడెం ఎమ్మెల్యేలు ఉపేందర్ రెడ్డి, వనమా వెంకటేశ్వరరావు, వైరా నుంచి స్వతంత్రంగా గెలిచిన రాములు నాయక్, సత్తుపల్లి తెదేపా ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యలు గులాబీ తీర్థం పుచ్చుకుంటామని ప్రకటించారు. ఈ రాజకీయ పునరేకీకరణ తెరాసకు కలిసి వచ్చిందనే చెప్పుకోవచ్చు.
తెరాస సిట్టింగ్ ఎంపీ పొంగులేటికి టికెట్ నిరాకరించి నామను అభ్యర్థిగా ప్రకటించడంపై ఎన్నికల ముందు సర్వత్రా ఆసక్తి నెలకొంది. పొంగులేటి మద్దతు ప్రకటించినప్పటికీ... ప్రచారంలో పాల్గొనలేదు. ఇవన్ని తెరాసను ఓటమిపాలు చేస్తాయని అందరూ భావించారు. కానీ గులాబీ జెండాకే పట్టం కట్టారు ఖమ్మం ప్రజలు.
పార్టీ ఫిరాయింపులు, ప్రభుత్వ వ్యతిరేకతే తమను గెలుపిస్తాయని కాంగ్రెస్ అంచనావేసింది. తాము ఓట్లేసి గెలిపించిన ఎమ్మెల్యేలు నెలలు కూడా గడవక ముందే... పార్టీ మారడం, ప్రజల తీర్పును అపహాస్యం చేయడం వంటి అంశాలు ప్రభావం చూపుతాయని భావించింది. ఖమ్మం ఓటర్లు మాత్రం.. అధికార పార్టీ తరఫున టికెట్ దక్కించుకున్న నామ నాగేశ్వరరావుకే అనూహ్యంగా పట్టం కట్టారు.
సార్వత్రిక ఎన్నికల ఫలితం పూర్తి ట్యాలీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి