నల్గొండ-వరంగల్- ఖమ్మం ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా... ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఆధ్వర్యంలో భారీ ద్విచక్రవాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పువ్వాడ అజయ్, ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. ప్రచార సభకు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హాజరయ్యారు. చాలా రోజుల తర్వాత మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మినహా తెరాస ముఖ్యనేతలంతా ఒకే వేదికపైకి వచ్చారు.
అనునిత్యం ప్రజాసంక్షేమం కోసం పనిచేసే తెరాసకే మరోసారి పట్టం కట్టాలని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ పిలుపునిచ్చారు. బూత్ స్థాయిలో కమిటీలు సమర్థంగా పనిచేసి గ్రామీణ ఓటర్లను ఓట్లు వేయించే బాధ్యత తీసుకోవాలని సూచించారు. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి పల్లా రాజేశ్వర్ రెడ్డికి భారీ ఆధిక్యంతో గెలిపించాలని ఎంపీ నామా నాగేశ్వరరావు పిలుపునిచ్చారు.
గుణాత్మాక మార్పులు తీసుకొచ్చి రాష్ట్రాభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్న సీఎం కేసీఆర్‌ను బలపరిచేందుకు తెరాసను గెలిపించాలని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. సీతారామ ప్రాజెక్టు పూర్తయితే ఉమ్మడి ఖమ్మం జిల్లా సస్యశ్యామలం అవుతుందన్నారు. నియామకాల విషయంలో తాను చెప్పేది తప్పని నిరూపిస్తే ఎమ్మెల్సీ అభ్యర్థిత్వం నుంచి తప్పుకుంటానని పల్లా రాజేశ్వర్ రెడ్డి సవాల్ విసిరారు. తాను ప్రశ్నించే గొంతుకలా కాకుండా..పరిష్కరించే గొంతుకలా పనిచేస్తాన్నారు.
రాష్ట్రంలో పట్టభద్రుల కోటాలో జరుగుతున్న రెండు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉద్యోగులు,నిరుద్యోగులు కాంగ్రెస్ పక్షాన నిలబడాలని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి కోరారు. తెరాస, భాజపా అభ్యర్థుల ఓటమికి నడుంబిగించాలని పనిచేయాలని పార్టీ శ్రేణులకు ఉద్బోధించారు. నల్లగొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థిగా వామపక్షాలు, ప్రజాసంఘాలు ఉపాధ్యాయులు, ఉద్యోగ సంఘాలు మద్దతిస్తున్న జయసారథిరెడ్డిని గెలిపించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డి కోరారు. హైదరాబాద్‌లోని సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన జయసారథిరెడ్డికి వామపక్షాల తరఫున బి ఫారం అందజేశారు.