రాదు.. లేదు అనుకున్నారు. తెలిసిన వాళ్లను అడిగారు.. కనిపించిన చోటల్లా వెతికారు.. ఒటకి రెండు కాదు... సుమారు 20 ఏళ్ల క్రితం దూరమైన తల్లి కోసం అన్ని ప్రయత్నాలు చేసిన కుటుంబ సభ్యులు చివరికి ఆమె మరణించి ఉంటుందనుకుని ఖర్మకాండలు నిర్వహించారు. కానీ అనుకోని విధంగా 20 ఏళ్ల తర్వాత తమ తల్లి జాడ తెలిస్తే ఆ కుటుంబం సంతోషంలో మునిగిపోయింది. పదేళ్ల ప్రాయంలో దూరమైన అమ్మను.. 30 ఏళ్ల వయస్సులో పిల్లల తండ్రి అయిన కొడుకు తడినయనాలతో తల్లికి స్వాగతం పలికాడు. తన తల్లిని చెంతకు చేర్చడంలో వారధిగా నిలిచిన ఈటీవీ భారత్‌కు ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకున్నాడు. ఈ సన్నివేశం చూస్తున్నవారి హృదయాలు బరువెక్కాయి.
ఆ తల్లి… బిడ్డల చెంతకు ఎలా చేరిందంటే..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో 20 ఏళ్లుగా ఓ మహిళ నడిరోడ్డుపైనే చీరలతో గుడిసె వేసుకుని జీవించేది. మతిస్తిమితిం లేని ఆమె భిక్షాటన చేసుకుని బతికేది. ఆమె దీనస్థితిపై 2018లో ఈనాడులో ప్రచురితమైన కథనం చూసి స్పందించిన అప్పటి తహసీల్దారు ఆమెను భద్రాచలంలోని సరోజిని వృద్ధాశ్రమంలో చేర్పించారు. అయితే అక్కడ నుంచి వచ్చేసిన ఆమె భద్రాచలంలోని బ్రిడ్జి సెంటర్లో మళ్లీ చీరలతో పాక వేసుకొని ఉండేది. ఆమె పరిస్థితిని గురించి "నడిరోడ్డే ఆవాసం... చీరగుడిసె నివాశం" శీర్షికతో ఈటీవీ భారత్‌లో ప్రచురితమైన కథనం చూసిన ఖమ్మం లోని అన్నం సేవా ఫౌండేషన్ వ్యవస్థాపకులు అన్నం శ్రీనివాసరావు ఆమెను చేరదీసి.. వసతి, వైద్యం చేయించారు. రెండేళ్ల తర్వాత కోలుకున్న ఆమె తన కుటుంబ సభ్యుల వివరాలు చెప్పింది. వాటిని సరిపోల్చుకున్న తర్వాత ఉత్తర్‌ప్రదేశ్‌లోని బాందా జిల్లాలో ఉన్న వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా.. ఆమె కుమారుడు వచ్చి తల్లిని గుర్తుపట్టాడు.
ఎక్కడ బతికిందో.. అక్కడే..
20 ఏళ్లుగా ఆమె గడిపిన ప్రదేశంలోనే అందరి సమక్షంలో తల్లిని బిడ్డకు అప్పగించారు. చనిపోయిందనుకున్న తల్లిని తమ చెంతకు చేర్చినందుకు అన్నం సేవా ఫౌండేషన్‌కు వారధిగా నిలిచిన ఈటీవీ భారత్‌కు తల్లీ బిడ్డలు కృతజ్ఞతలు తెలిపారు.
ఇదీ చూడండి: నడిరోడ్డే ఆవాసం... చీర గుడిసే నివాసం