కరోనా బాధిత కుటుంబానికి నేనున్నానంటూ ఫోన్లో మనోధైర్యం కల్పిస్తున్న ఈయన పేరు సాబీర్ పాషా. ఈయన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.... సీపీఐ జిల్లా కార్యదర్శి. దశాబ్దాలుగా ప్రజా ఉద్యమాల్లో ఉన్న నాయకుడు. గతేడాది కొత్తగూడెంకు చెందిన తోటి ప్రజా ఉద్యమ నాయకులు ఇద్దరు చనిపోవడం.. సాబీర్ పాషాను కలిచివేసింది. వారు చనిపోయిన సందర్భంలో వారి కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్లారు. ఆ సమయంలో కుటుంబ సభ్యులను పలకరించిన వారే లేరు. కనీసం అంత్యక్రియలు నిర్వహించేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ఆ పరిస్థితులు చూసి చలించిపోయిన సాబీర్ పాషా.. తోటి ప్రజాఉద్యమ నాయకులకు కనీసం చివరి వీడ్కోలు పలకలేమా అని ఆలోచించారు. 20 ఏళ్లు వారితో ఉన్న అనుబంధాన్ని స్మరించుకుంటూ.. మరో నలుగురు సీపీఐ కార్యకర్తలను వెంటబెట్టుకుని సంప్రదాయబద్ధంగా అంత్యక్రియలు నిర్వహించారు. అలా కొవిడ్ బాధిత మృతులకు అంత్యక్రియలు నిర్వహించే కార్యంలో అడుగేసిన సాబీర్ పాషా.. ఏడాదిగా కార్యక్రమం కొనసాగిస్తున్నారు.
ఏడాదిలో 70 అంతిమ సంస్కారాలు..
ఏడాదిలో దాదాపు 70కిపైగా కొవిడ్ మృతదేహాలకు తుదివీడ్కోలు పలికారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో చనిపోయిన వారికి తానే స్వయంగా అంబులెన్సు సౌకర్యం కల్పించి మృతులకు అంతిమ సంస్కారాలు నిర్వహిస్తున్నారు. సాబీర్ పాషాను స్ఫూర్తిగా తీసుకుని భద్రాద్రి జిల్లాలో మరో ఐదు బృందాలు కరోనా మృతులకు అంత్యక్రియలు నిర్వహిస్తున్నాయి. సాబీర్ పాషా బృందం కొత్తగూడెం, పాల్వంచ, ఆళ్లపల్లి, గుండాల, లక్ష్మీదేవిపల్లిలో సేవలు అందిస్తున్నాయి. ఇల్లందు, అశ్వాపురం, జూలూరుపాడుతోపాటు మరికొన్ని ప్రాంతాల్లో సీపీఐ, ప్రజాసంఘాల కార్యకర్తలు సేవలు అందిస్తున్నారు.
కొవిడ్ మృతులకు అంత్యక్రియలే కాకుండా.. బాధితులకు మనోధైర్యం కల్పించడం, అవసమైనవారిని ఆస్పత్రుల్లో చేర్పించడం వంటి సామాజిక కార్యక్రమాల్లో సాబీర్ పాషా బృందం పాలుపంచుకుంటోంది. పలుచోట్ల కొవిడ్ బాధితులకు భోజన సదుపాయం సైతం కల్పిస్తున్నారు.
ఇవీ చూడండి: ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో 4 ఆక్సిజన్ ప్లాంట్లు