Bhatti Vikramarka Comments: రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 75 కిలోమీటర్ల పాదయాత్ర నిర్వహించనున్నట్లు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తెలిపారు. ఆగస్టు 9 నుంచి 15 వరకు ఈ పాదయాత్ర చేయనున్నట్టు ఖమ్మం క్యాంపు కార్యాలయంలో వెల్లడించారు. పాదయాత్ర ద్వారా స్వాతంత్య్ర ఉద్యమ స్ఫూర్తిని తెలియజేయనున్నట్లు పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రాణాలుపణంగా పెట్టి స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్నారని తెలిపారు. స్వాతంత్య్ర ఉద్యమంలో ఎటువంటి పాత్రలేని భాజపా.. దేశభక్తి ప్రదర్శించడం సిగ్గుచేటన్నారు. కాంగ్రెస్ హయాంలోని ప్రణాళిక సంఘం విజయవంతమైందని.. నీతి అయోగ్ విఫలమైందని భట్టి తెలిపారు.
కాంగ్రెస్ నేతల వలసల పర్వంపై స్పందించిన భట్టి విక్రమార్క.. ఈ అంశంపై సీనియర్లతో చర్చిస్తామన్నారు. కొందరు నాయకులు పార్టీని వదిలివెళ్తున్నందుకు.. కాంగ్రెస్ వాదులు ఎవరూ ఆందోళన చెందొద్దని సూచించారు. అందరం కలిసి కష్టపడి వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపిద్దామన్నారు. ప్రజల ఆకాంక్షలు, లక్ష్యాలు నెరవేర్చేలా ముందుకెళ్దామని శ్రేణుల్లో భరోసా నింపారు.
"వలసల పర్వంపై సీనియర్లు అందరితో స్వయంగా మాట్లాడతా. కొంతమంది నాయకులు వెళ్లిపోతున్నందుకు కాంగ్రెస్ వాదులు ఎవరూ ఆందోళన చెందవద్దు. నేనే కాంగ్రెస్....కాంగ్రెసే నేను. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపిద్దాం. ప్రజల ఆకాంక్షలు, లక్ష్యాలు నెరవేర్చేలా ముందుకెళ్దాం." -భట్టి విక్రమార్క, సీఎల్పీ నేత
ఇవీ చూడండి: