గత నగరపాలక సంస్థ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలు నెరవేర్చిన తర్వాతే మళ్లీ తెరాస ఓట్లడగాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. తెరాస పాలకవర్గం పూర్తిగా... అబద్దాలు, మోసాలు, మాయమాటలతోనే పబ్బం గడుపుతూ వచ్చిందని ఆరోపించారు. రానున్న ఎన్నికల్లో ఖమ్మం నగర ప్రజలు తెరాస వాగ్దానాలు నమ్మే స్థితిలో లేరని... ప్రజల నుంచి తిరుగుబాటు తప్పదన్నారు.
ఖమ్మం నగరాన్ని మొత్తం తానే అభివృద్ధి చేసినట్టు మంత్రి పువ్వాడ అజయ్ ప్రచార ఆర్భాటాలు చేస్తున్నారని విమర్శించారు. తాను వచ్చిన తర్వాతే ఖమ్మం అభివృద్ధి చెందినట్లు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. నాడు కాంగ్రెస్ ప్రభుత్వం వేసిన రహదారులకు మధ్యలో లైట్లు పెట్టి, కూడళ్లలో ఫౌంటేన్లు కట్టి... ఇదే అభివృద్ధి అని చెబుతున్నారని ఎద్దేవా చేశారు. నగర అభివృద్ధి అంటే మమత ఆస్పత్రి చుట్టూ అభివృద్ధి కాదని... భట్టి విక్రమార్క హితవు పలికారు.