జగిత్యాల జిల్లా కేంద్రంలో వాణినగర్ ధర్మశాల వద్ద రమేష్, ఆయన భార్య రమ్య తాళం చెవులు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. లాక్డౌన్ కారణంగా వీరికి ఉపాధి లేకుండా పోయింది. దీనికి తోడు.. గత కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రమ్యకి వైద్యం చేయించే ఆర్థిక స్థోమత లేక అలాగే నెట్టుకొస్తున్నారు. లాక్డౌన్ సమయంలో రమ్య అనారోగ్యంతో చనిపోగా.. అంత్యక్రియలు నిర్వహించడానికి కూడా రమేష్ వద్ద డబ్బులు లేవు. అతని దయనీయ పరిస్థితిని గమనించిన స్థానిక కౌన్సిలర్ రాజ్‌కుమార్, మున్సిపల్ సిబ్బంది అంత్యక్రియలు నిర్వహించారు. సమాచారం తెలుసుకున్న అదికారులు వారిని పట్టణ నిరాశ్రయుల కేంద్రానికి తరలించారు. తల్లికి దూరమైన పిల్లలిద్దరు గుక్కపట్టి ఏడుస్తున్నారు. ఎనిమిది నెలల చిన్నారి పాలకోసం ఏడుస్తుంటే చూసేవారి హృదయాలు ద్రవించిపోయాయి.
సమాచారం అందుకున్న జిల్లా కలెక్టర్ రవి నిరాశ్రయులైన రమేష్ కుటుంబానికి సాయం అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం వారికి మెప్మా ఆధ్వర్యంలో రమేష్‌కు, ఇద్దరు పిల్లలకు భోజనం, వసతి ఏర్పాటు చేశారు. దాతలు సాయం అందిస్తున్నారు. సత్యసాయి సేవాసమితి ఆధ్వర్యంలో ఐదు వేల నగదు, 5వేల రూపాయల విలువ చేసే వంట సామగ్రి అందజేశారు. పిల్లలకు పాల డబ్బాలు, పండ్లు బిస్కెట్లు అందజేసి బాధలో ఉన్న రమేష్ కుటుంబాన్ని ఓదార్చారు.
ఇవీ చూడండి: రాష్ట్రంలో 800 మార్కు దాటిన కరోనా కేసులు