karimnagar mlc elections: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 1,326 ఓట్లు ఉండగా ఇందులో 996 మంది అధికార తెరాస పార్టీకి చెందిన వారే కావడంతో గెలుపు నల్లేరుపై నడక అనే ప్రచారం జరిగినా.. ఆచరణలో మాత్రం అంత సునాయాసం కనిపించడం లేదు. ఈ ఎన్నికల్లో ఒక ప్రజా ప్రతినిధి ఇద్దరు అభ్యర్థులకు ఓటేయాల్సి ఉంటుంది. ఇందులో మండల పరిషత్, జిల్లా పరిషత్ సభలకు ప్రాతినిధ్యం వహిస్తున్న వారిలో నైరాశ్యం నెలకొంది. తమకు నిధులు కేటాయించే విషయంలో, విధులు అప్పగించే విషయంలో సర్కారుపై అసంతృప్తి బహిరంగంగానే వ్యక్తమవుతోంది. ఇదే సమయంలో సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్న భాను ప్రసాదరావుపై కూడా స్థానిక ప్రతినిధుల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉందని ప్రచారం జరుగుతోంది. వీటన్నింటిని ఆసరాగా తీసుకుని ప్రత్యర్థులు గెలుపు కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. ఇది ముందే గమనించిన అధికార పార్టీ.. అధిష్ఠానం సూచన మేరకు క్యాంపు రాజకీయాలు షురూ చేసినట్టుగా అర్థం అవుతోంది. పార్టీతో అనుబంధం ఉన్నప్పటికీ.. రహస్య ఓటింగ్ కావడంతో తమ ఓటర్లు పక్క చూపులు చూడకుండా ఉండేందుకు అధికార పార్టీ అప్రమత్తం అయినట్టు తెలుస్తోంది.
ఓట్ల కోసం కొనసాగుతున్న బేరసారాలు..
మండలిలో అడుగుపెట్టేందుకు అభ్యర్థికి 664 ఓట్లు వస్తే మెజార్టీ సాధించినట్టు అవుతుంది. తెరాసకు 996 మంది ఓటర్లు ఉండగా 330 మంది కాంగ్రెస్, భాజపా, స్వతంత్రులు ఉన్నారు. గెలుపుకోసం అవసరమైన మెజార్టీని పొందేందుకు ప్రత్యర్థులు బంపర్ ఆఫర్ ఇస్తున్నట్టుగా ప్రచారం సాగుతోంది. హుజూరాబాద్ ఫలితాల దృష్ట్యా ఈ ఎన్నికల్లో అధికార పార్టీ కూడా తమ ఓటర్లు చేజారకుండా జాగ్రత్త పడుతున్నట్లు తెలుస్తోంది. క్యాంపులను నిర్వహించి దేశంలోని వివిధ ప్రాంతాలకు తీసుకెళ్లడమే కాకుండా ఒక్కో ఓటరుకు రూ. 2 లక్షల వరకు ముట్టజెప్పాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఇద్దరు అభ్యర్థులకు ఓటేయాలన్న హామీతో ఈమేరకు ఇవ్వనున్నట్లు సమాచారం.
వ్యతిరేకతను అనుకూలం చేసుకునేందుకు..
హుజురాబాద్ ఓటర్లు ఇచ్చిన తీర్పు పునరావృతం అవుతుందా..? అన్న చర్చ జిల్లాలో కొనసాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత, స్థానిక సంస్థలకు నిధుల కేటాయింపులో మొండిచేయి.. ప్రతినిధుల్లో నెలకొన్న అసహనాన్ని ఓటు రూపంలో చూపించే అవకాశాలు ఉన్నాయని అంచనా వేసుకుంటున్నారు. నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ పూర్తయితే ఎంత మంది పోటీలో ఉంటారు.. ఎవరికి పరిస్థితులు అనుకూలంగా ఉంటుందనే అంశంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
ఇవీ చూడండి: