TRS Camp Politics: ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్యాంపు రాజకీయాలు నడుస్తున్నాయి. మెజార్టీ ఉన్న.. నిఘావర్గాల హెచ్చరికలతో అధికార తెరాస తమ ఓటర్లను క్యాంపులకు పంపక తప్పని పరిస్థితి ఏర్పడింది. దాంతో పాటు కొందరు కీలక నేతలనూ క్యాంపులకు పంపి ఎవరూ చేజారకుండా జాగ్రత్తపడుతోంది.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో స్థానిక సంస్థల కోటాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఈనెల 10న ఎన్నికలు జరగనున్నాయి. 14న ఫలితాలు వెలువడనున్నాయి. తెరాస తరఫున ఎల్. రమణ, భానుప్రసాద్‌రావును బరిలో నిలిపింది. అనూహ్యంగా కరీంనగర్ మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్.. తెరాస అధిష్ఠానం ఆదేశాలను దిక్కరించి.. బరిలో నిలిచారు. దీంతో గులాబీ దళం అప్రమత్తం అయింది. దాంతో పాటు నిఘావర్గాల హెచ్చరికలతో.. ప్రత్యేక చర్యలు చేపట్టింది.
క్యాంపుల్లో స్థానిక ప్రజాప్రతినిధులు సహా కీలక నేతలు..
mlc elections in karimnagar: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో తెరాస తరఫున గెలిచిన స్థానిక సంస్థల సభ్యులను.. ఇతర పార్టీల ప్రలోభాలకు చిక్కకుండా క్యాంపులకు తరలించింది. వారితో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, మేయర్ సునీల్‌రావు, జిల్లాలోని ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంఛార్జీలు, మరికొంతమంది ముఖ్యులు క్యాంపులకు వెళ్లాలని తెరాస అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించినట్లు సమాచారం. దీంతో వారంతా క్యాంపులకు వెళ్లి.. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను మానిటరింగ్ చేస్తున్నారు. వారితో రోజూ సమావేశం అవుతూ.. వారిపై ప్రత్యర్థుల ప్రభావం లేకుండా జాగ్రత్తపడుతున్నారు. క్యాంపుల్లో ఉన్నవారు.. ప్రత్యర్థులకు కలవకుండా చూస్తున్నారు. వీరంతా పోలింగ్ వరకూ క్యాంపుల్లోనే ఉండనున్నారని సమాచారం.
మాజీ మేయర్ రవీందర్ సింగ్ కారణమా..?
తెరాస అధిష్ఠానం నిర్ణయాన్ని ధిక్కరించి బరిలో నిలిచిన కరీంనగర్ మాజీ మేయర్ సర్దార్ రవీందర్‌సింగ్ కారణంగానే గులాబీ పార్టీ క్యాంపు రాజకీయాలకు తెరతీసినట్లు చర్చ జరుగుతోంది. అతనికి ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వ్యక్తిగత పరిచయాలు ఉండడం సహా ప్రత్యర్థి పార్టీల మద్దతు కూడగడుతున్నారనే సమాచారంతో గులాబీ దళం అప్రమత్తమైనట్లు తెలుస్తోంది. దాంతో పాటు హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్.. రవీందర్ సింగ్‌కు మద్దతు ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతుండడం వల్ల.. ఓట్లు చీలకుండా వ్యూహాలకు పదునుపెడుతున్నట్లు సమాచారం.
క్రాస్ ఓటింగ్ జరగకుండా పక్కా స్కెచ్..
ఒక ఓటు రమణకు.. మరో ఓటు రవీందర్‌సింగ్‌కు అన్న ప్రచారం తీవ్రంగా సాగుతున్న నేపథ్యంలో.. ఎట్టి పరిస్థితుల్లోనూ తెరాస అభ్యర్థులిద్దరూ గెలవాలని.. క్రాస్ ఓటింగ్ జరగకూడదనే గట్టి పట్టుదలతో తెరాస ప్రణాళికలు అమలు చేస్తోంది. సగం మంది మొదటి ప్రాధాన్యత ఓటును రమణకు, రెండో ప్రాధాన్య ఓటును భానుప్రసాదరావు వేయ్యాలని.. మిలిగిన సగం మంది మొదటి ప్రాధాన్యత ఓటును భానుప్రసాదరావుకు, రెండో ప్రాధాన్యత ఓటును ఎల్.రమణకు వేయాలన్న అంశంపై ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నారు. ఒక్క ఓటు కూడా చీలకుండా ఉండేందుకు స్థానిక ప్రజాప్రతినిధులు మచ్చిక చేసుకొనే పనిలో గులాబీ నేతలు నిమగ్నమైనట్లు సమాచారం.
స్విమ్మింగ్, గుర్రపు స్వారీలతో సరదా సరదాగా..
క్యాంపులో ఉన్న స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల్లో మండల పరిషత్, జిల్లా పరిషత్, మున్సిపాలిటీల వారిగా లెక్కలు తీసిన.. తెరాస అధిష్ఠానం.. ప్రత్యర్థి వైపు మొగ్గుచూపుతున్నవారి లెక్కలూ తీసినట్టుగా తెలుస్తోంది. వారిపై ప్రత్యేకంగా దృష్టిసారించినట్లు సమాచారం. వారి ఓట్లు డైవర్ట్ కాకుండా ఉండేందుకు చర్యలు చేపట్టారు. ఫలితంగా వారంతా నామినేషన్ల రోజు నుంచే సరదాగా గడుపుతున్న వీడియోలు, ఫోటోలు వైరల్ అవుతున్నాయి. వీరంతా హైదరాబాద్, గోవాతో పాటు బెంగళూరు రిసార్ట్స్‌లో సరదాగా గడుపుతున్నారు. బెంగళూరులోని రిసార్టులో మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ గుర్రపు స్వారీ చేస్తున్న వీడియా వైరల్ అయింది.
'ఒమిక్రాన్ కేసులొస్తుంటే బెంగళురూలో క్యాంపులా..'
బెంగళూరులో కరోనా కొత్తవేరియంట్ ఒమిక్రాన్ కేసులు వెలుగు చూసిన నేపథ్యంలో... అక్కడ క్యాంపులు పెట్టడంపై పలువులు విమర్శలు కురిపిస్తున్నారు.
ఇదీచూడండి: MLC Elections : ఎమ్మెల్సీ ఎన్నికలకు 'కారు' సన్నద్ధత.. శిబిరాలకు ప్రజాప్రతినిధులు