కరీంనగర్‌లో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించేందుకు నగరపాలక సంస్థ చర్యలు చేపడుతోంది. ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించేందుకు కోట్ల రూపాయలు వెచ్చిస్తోంది. ఇంతకు ముందు వాణిజ్య అవసరాలు పబ్లిక్ మీటింగులకు ఉపయోగపడిన సర్కస్ గ్రౌండ్‌ను... రూ.మూడున్నర కోట్లతో అందంగా ఆహ్లాదంగా తీర్చిదిద్దుతున్నారు. కరీంనగర్ నడిబొడ్డున అన్ని వర్గాల ప్రజలకు సౌకర్యం ఉండటమే కాకుండా చిన్నచిన్న వేడుకలు నిర్వహించేందుకు వీలుగా సిద్ధం చేస్తున్నారు.
పచ్చిక బయళ్లను..
చిన్నపిల్లలు ఆడుకోవడానికి వీలుగా రకరకాల బొమ్మలు ఏర్పాటు చేస్తున్నారు. చూడచక్కగా పచ్చిక బయళ్లను తీర్చిదిద్దుతున్నారు. ఆటవస్తువులను, వాటర్ ఫౌంటెయిన్‌లను పార్క్‌లో సమకూర్చుతున్నారు. దాదాపు పనులన్నీ చివరి దశకు చేరుకున్నాయని మేయర్ సునీల్‌రావు తెలిపారు.
ఆరోగ్యంపై దృష్టి..
ప్రస్తుతం ప్రతి ఒక్కరు ఆరోగ్యం పట్ల దృష్టి సారిస్తుండటంతో వారికి అవసరమైన సదుపాయాలు కల్పిస్తున్నారు. కాలినడక కోసం ప్రత్యేక ట్రాక్ ఏర్పాటు చేస్తున్నారు. ప్రధానంగా సిమెంట్ రోడ్లపై కాలినడకతో మొకాళ్ల నొప్పులు వస్తాయన్న ఉద్దేశ్యంతో ప్రత్యేకంగా ఈపీడీఎంట్రాక్ నిర్మిస్తున్నారు. కేవలం 350మీటర్ల దూరానికి దాదాపు రూ.38లక్షల ఖర్చు చేస్తున్నారు. హైదరాబాద్ తర్వాత మొట్టమొదటిసారిగా కరీంనగర్‌లోనే ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం 15మిల్లీమీటర్ల కుషన్ ఉండే విధంగా ట్రాక్ నిర్మిస్తున్నారు.
ప్రైవేట్‌కు నిర్వహణ బాధ్యతలు..
ఇదే ప్రాంతంలో ఏసీ బస్‌స్టాప్ కూడా నిర్మిస్తున్నారు. సాధ్యమైనంత త్వరలో అందుబాటులోకి తీసుకొస్తామని అధికారులు చెబుతున్నారు. ప్రైవేటీ ఏజెన్సీకి నిర్వహణ బాధ్యతలు అప్పగించాలని భావిస్తున్నారు.
ఇవీ చూడండి: సర్వం కోల్పోతున్న గ్రామాలు.. పట్టించుకోని సర్కార్