నాడు తెలంగాణ ఉద్యమ సమయం మొదలు.. తాజా రాజకీయ పరిణామాల వరకు ప్రత్యేకతల కలబోతగా ఈ నియోజకవర్గానికి ప్రత్యేక పేరుంది. ఆరుసార్లు ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా గెలిచి రెండు సార్లు మంత్రిగా ప్రాతినిధ్యం వహించిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ (etela Rajender) తెరాస నుంచి బయటకు రావడంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఊహించని రాజకీయ పరిణామాలు గడిచిన నాలుగైదు నెలల్లో చోటుచేసుకున్నాయి. ఆత్మగౌరవ బావుటాను ఎగురవేస్తానని ఈటల అంటుండటం.. అధికార పార్టీ చేస్తున్న అభివృద్ధి అండగా తమ అభ్యర్థినే గెలిపిస్తామనేలా తెరాస దూకుడును చూపిస్తుండటంతో ఇన్నాళ్లుగా ఇక్కడి ప్రచారం హోరాహోరీ తీరునే తలపించింది. మాటల తూటలు పేలడం.. నువ్వా-నేనా అంటూ సవాళ్లకు ప్రతి సవాళ్లు విసురడంతో ఇక్కడి ఉపసమరం ప్రతిష్ఠాత్మక పోరుగా మారింది.
రాజకీయ ఉత్కంఠ
ఎన్నికల షెడ్యూల్( Huzurabad bypoll 2021) ప్రకటనతో తెరాస, భాజపా, కాంగ్రెస్ శ్రేణుల్లో మరింత ఉత్కంఠ మొదలైంది. గడిచిన కొన్నాళ్లుగా ఇక్కడి రాజకీయాల్లో సందడి కనిపించింది. అనేక నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నప్పటికీ ఆయా పార్టీలు తమ ఉనికిని కాపాడుకోవడంతోపాటు పార్టీ అభ్యున్నతికి అవసరమైన అన్ని రకాల ఎత్తుగడలతో ముందుకు సాగుతున్నాయి. వలసల్ని ప్రోత్సహిస్తూనే ప్రజల మనస్సుల్ని గెలిచే ప్రయత్నాల్ని చేపట్టాయి. అధికార తెరాస నుంచి ఈటల రాజేందర్ బయటకు వెళ్లడంతో తెరాస తమ పార్టీ అభ్యర్థిగా తెలంగాణ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, వీణవంక మండలం హిమ్మత్‌నగర్‌కు చెందిన గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను అభ్యర్థిగా ప్రకటించింది. రాష్ట్రమంత్రి తన్నీరు హరీశ్‌రావు ఆ పార్టీ తరపున ఇక్కడ ఎన్నికల ఇన్ఛార్జీగా వ్యవహరిస్తూ ఇక్కడి ఎన్నికను సవాలుగా తీసుకుంటున్నారు. మరోవైపు కాషాయ కండువాను కప్పుకొన్న మాజీ మంత్రి ఈటల రాజేందర్ తనకు జరిగిన అన్యాయంతోపాటు ఆత్మగౌరవం పేరిట ప్రజల మన్ననల్ని పొందేలా ప్రజల ఆశీస్సులను అందుకునే ప్రయత్నాల్ని చేస్తున్నారు. కొన్నాళ్లు పాదయాత్రను నిర్వహించారు. కరీంనగర్ జిల్లాకు చెందిన భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్‌తోపాటు రాష్ట్ర, జాతీయ స్థాయి నాయకులు ఇక్కడి ప్రచారానికి విచ్చేశారు. ఇక కాంగ్రెస్ పార్టీ తరపున గత ఎన్నికల్లో పోటీ చేసిన పాడి కౌశిక్‌రెడ్డి తెరాస గూటిని చేరడంతో ఇక్క హస్తం పార్టీ మరో అభ్యర్థి అన్వేషణలో పడింది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఇక్కడి ఎన్నికను సవాలుగా తీసుకుని అన్ని మండలాలకు బాధ్యులను నియమించారు. కొన్నాళ్లు క్షేత్రస్థాయిలో పర్యటించిన నేతలు ఉప ఎన్నిక తేదీ ఖరారు కాకపోవడంతో మిన్నకున్నారు. తాజాగా సందడి మొదలవడంతో డీసీసీ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ, కిసాన్‌సెల్ జిల్లాధ్యక్షుడు పత్తి కృష్ణారెడ్డి సహా మరో ఇద్దరి పేర్లను ఏఐసీసీ ఆమోదం కోసం పంపించినట్లు పార్టీలో చర్చజరుగుతోంది. మరో నెల రోజులపాటు ఉప ఎన్నికల జోరు ఉండటంతో మూడు పార్టీలతోపాటు ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తల్లో సందడి మొదలైంది.
ఇక్కడ ఇది 18వ పోరు..
ఐదు మండలాలు, రెండు పురపాలికలతో హుజూరాబాద్ నియోజకవర్గం ఏర్పాటై ఉంది. కరీంనగర్ జిల్లాలోని వీణవంక, ఇల్లందకుంట, జమ్మికుంట గ్రామీణం, హుజూరాబాద్ గ్రామీణం మండలాలతోపాటు జమ్మికుంట, హుజూరాబాద్ పురపాలికలున్నాయి.హనుమకొండ జిల్లాలోని కమలాపూర్ మండలం కూడా ఈ నియోజకవర్గ పరిధిలోనే ఉంది. 2018లో జరిగిన ఎన్నికల సమయంలో 2,09,224 మంది ఓటర్లుండగా ఈసారి మరో 27,059 మంది ఓటర్లు పెరిగారు. 1952లో ద్విసభ్యుల నియోజకవర్గంగా ఏర్పాటైన హుజూరాబాద్‌లో ఇప్పటి వరకు 17 సార్లు శాసనసభ్యుడి కోసం ఎన్నికలు జరిగాయి. ప్రస్తుతం జరుగుతున్నది 18వ ఎన్నిక. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున సాగుతున్న తరుణంలో 2008, 2010లో ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో ఉప సమరం తప్పలేదు. తాజాగా మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో మూడోసారి ఉప ఎన్నిక జరుగుతోంది. మరోవైపు ఇక్కడి ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లను చేపట్టడంతో యంత్రాంగం నిమగ్నమైంది. ఇప్పటికే ఓటర్ల నమోదును చేపట్టగా త్వరలో ఎన్నికల సిబ్బంది విషయమై శిక్షణలను ప్రారంభించనుంది.
పారదర్శకంగా ప్రక్రియ
ఈ ఉప ఎన్నికల్ని పారదర్శకంగా నిర్వహిస్తాం. అన్ని రాజకీయ పార్టీలకు సూచనల్ని అందిస్తున్నాం. ఎన్నికల వ్యయం మొదలు, పర్యవేక్షణ అధికారులు, పోలింగ్ సిబ్బందికి శిక్షణలు పక్కాగా కొనసాగిస్తాం. ఇప్పటికే హుజూరాబాద్‌లో 70శాతానికిపైగా ఓటర్లకు వ్యాక్సినేషన్ మొదటి డోసు వేశాం. 50శాతం మంది రెండో టీకాను అందుకున్నారు. ఎక్కడ కూడా లోటుపాట్లు లేకుండా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పక్కాగా అమలు చేస్తాం.
ఇబ్బంది కలగకుండా
ఈ ఉప ఎన్నికల్లో ఎక్కడ కూడా శాంతిభద్రతలకు ఇబ్బంది కలగకుండా అవసరమైన భద్రతను కొనసాగిస్తాం. సమస్యాత్మక ప్రాంతాలపై దృష్టి పెడుతాం. ముఖ్యంగా కోడ్‌ను పక్కాగా అన్ని పార్టీలు పాటించేలా నిఘాను పెంచుతాం. ఎన్నికల విధుల్లో నిస్పక్షపాతంగా వ్యవహరిస్తాం. హింసాత్మక సంఘటనలు జరుగకుండా ప్రశాంత వాతావరణంలో పోలింగ్ జరిగేలా మా వంతు బాధ్యతను విధిగా నిర్వర్తిస్తాం. ఎన్నికల ఫిర్యాదు కోసం కంట్రోల్ రూమును ఏర్పాటు చేయించి ప్రత్యేక నజర్ పెడుతాం.
ఇవీచదవండి :