కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన ఆంక్షల సడలింపుతో వ్యాపార, వాణిజ్య సముదాయాలు కిటకిటలాడుతున్నాయి. ఇన్నాళ్లుగా కరోనా ప్రభావంతో దూరమైన వ్యాపారాలను దగ్గర చేసుకునే ప్రయత్నాల్లో క్రమంగా నిమగ్నమవుతున్నారు. సీ కేటగిరీలో ఉన్న వ్యాపారాలు, ఇతరత్రా సంస్థలు తప్ప దాదాపుగా అన్ని రకాల వ్యాపార లావాదేవీలను పట్టాలెక్కించుకునేలా యజమానులు అడుగులు ముందుకేస్తున్నారు.
ఓ వైపు జాగ్రత్తల్ని తీసుకుంటూనే మరోవైపు ఎవరికివారు బతుకుబండిని నడిపించేందుకు మానసికంగా సంసిద్ధమవుతున్నారు. కరీంనగర్ పట్టణంతోపాటు హుజురాబాద్, జమ్మికుంట, కొత్తపల్లి, చొప్పదండి పట్టణాల్లో జనజీవనం యథావిధిగా సాగుతోంది.
పెరిగిన రవాణా
ఆర్టీసీ బస్సులు రెండోరోజు రోడ్లపై పరుగులు పెట్టాయి. తొలిరోజున నామమాత్రంగానే నడిచిన బస్సులు రెండోరోజున అన్నిమార్గాల్లో పయనించాయి. రెండో రోజు ప్రయాణికుల స్పందన కనిపించింది. మంగళవారం కరీంనగర్-1, కరీంనగర్-2 డిపోలతోపాటు హుజూరాబాద్ డిపోలలో మొత్తం 313 బస్సులకు గాను కేవలం 171 మాత్రమే రోడ్డెక్కాయి. 296 మంది డ్రైవర్లు, 325 మంది కండక్టర్లు విధులకు హాజరయ్యారు.
బుధవారం మాత్రం జిల్లాలో 199 బస్సులు తిరుగగా 650 మంది డ్రైవర్లు, కండక్టర్లు విధుల్ని నిర్వర్తించారు. కరీంనగర్‌తోపాటు జిల్లాలోని మరో నాలుగు పట్టణాల్లో ఆటోల రవాణా మెరుగ్గానే కనిపించింది. జిల్లావ్యాప్తంగా 17,411 ఆటోలు ఉండగా ఇప్పటికే 80శాతానికిపైగా ఆటోలు ఆయా మార్గాల్లో ప్రయాణాలు సాగిస్తున్నాయి. ద్విచక్రవాహనాలు, కార్లు యథావిధిగా రోడ్లపై తిరుగుతున్నాయి. చిరు వ్యాపారులతోపాటు అన్ని రకాల దుకాణాల వద్ద ఇప్పుడిప్పుడే వ్యాపార సందడి పెరుగుతోంది.