అక్రమ లే అవుట్ల తొలగింపులో పెద్దపెల్లి జిల్లా మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అక్రమంగా లే అవుట్లను ఏర్పాటు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించినప్పటికీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం పట్టణ ప్రగతి కొనసాగుతున్న నేపథ్యంలో అక్రమ లేఅవుట్లను తొలగించాలని అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయినప్పటికీ ఈ ప్రక్రియ మందకొడిగా సాగడం పట్ల విమర్శలు వెల్లవెత్తుతున్నాయి.
రామగుండం కార్పొరేషన్తో పాటు పెద్దపల్లి, సుల్తానాబాద్, మంథని మున్సిపాలిటీల్లో రియల్ వ్యాపారం జోరుగా సాగుతోంది. పట్టణ ప్రణాళిక అధికారులు ఇప్పటికే 59 లే అవుట్లను గుర్తించారు. వీటి గుర్తింపు, తొలగింపు ప్రక్రియలో ఎలాంటి అలసత్వం, రాజకీయం ఇతర ప్రలోభాలకు గురి కావద్దని నిష్పక్షపాతంగా వ్యవహరించాలని అధికారులకు సూచించారు. అయితే నిన్నటి వరకు ఈ లేఅవుట్ల యజమానులకు కొమ్ముకాసిన అధికారుల వెన్నులో వణుకు మొదలైంది. నేటితో పట్టణ ప్రగతి కార్యక్రమం పూర్తికానున్న సందర్భంగా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
ఇవీ చూడండి: కరోనా ఎఫెక్ట్: మెట్రో ముందు జాగ్రత్త చర్యలు