కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తైన తర్వాత గోదావరి నదీ నిండుకుండను తలపిస్తోంది. వరద ప్రవాహం నిరంతరం కొనసాగతోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో దాదాపు 170 కిలోమీటర్లు ప్రవహిస్తున్న గోదావరి నదీని ఆనుకొని పలు గ్రామాలు, పట్టణాలు ఉన్నాయి. గోదావరిఖని సమీపంలో ఉన్న వంతెనపై రెయిలింగ్ తక్కువ ఎత్తులో ఉన్నందున ఆత్మహత్యలకు నిలయంగా మారుతోంది. ఏమాత్రం చిన్న గొడవ జరిగినా ఇక్కడికి వచ్చి బలవన్మరణాలకు పాల్పడుతున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వంతెనపై నుంచి వెళ్తున్న వారిని అప్రమత్తం చేసేందుకు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదన్న పలువురు.. తగిన రక్షణ కల్పించాలని కోరుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
లేక్ పోలీసులతో గస్తీ ..
గోదావరి పరివాహక ప్రాంతంలో ప్రమాదాలు అధికంగా జరుగుతున్నందున ప్రత్యేకనిఘా ఏర్పాటు చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. సీసీ కెమెరాలతో పాటు, లేక్ పోలీసులతో గస్తీ కాస్తున్నట్లు తెలిపారు. ఆత్మహత్యలకు యత్నించిన వారిని కాపాడటమే కాకుండా బలవన్మరణానికి పాల్పడే వారికి కౌన్సెలింగ్ ఇస్తున్నట్లు వివరించారు. వంతెన రెయిలింగ్ ఎత్తును పెంచాలని ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు చెప్పారు. రక్షణ చర్యల కోసం సింగరేణి, ఎన్టీపీసీ సంస్థలను కోరినట్లు గోదావరిఖని ఏసీపీ తెలిపారు.
కరీంనగర్ దిగువ మానేరు వద్ద ఏర్పాటు చేసిన లేక్ పోలీస్ తరహాలో పరివాహక ప్రాంతాల్లోను ప్రత్యేక రక్షణతో పాటు వంతెనపై రెయిలింగ్ ఎత్తును పెంచాలని స్థానికులు కోరుతున్నారు.