ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తూ అధికారులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. మాస్కులు లేకుండా బహిరంగ ప్రదేశాల్లో తిరగవద్దని సూచిస్తున్నారు. ప్రధానంగా వివిధ పనుల కోసం అధికారుల కార్యాలయాలకు వచ్చే వాళ్లు నిబంధనలు పాటించాలని స్పష్టం చేస్తున్నారు. మాస్క్ ధరిస్తేనే కార్యాలయంలోకి అడుగు పెట్టాలని స్పష్టం చేస్తున్నారు. కలెక్టరేట్‌లోకి ప్రవేశించేందుకు ఒక ద్వారం మాత్రమే తెరిచి ఉంచారు. నేరుగా కాకుండా కిటికీల నుంచి మాత్రమే అర్జీలు స్వీకరిస్తున్నారు. రిజిస్ట్రేషన్‌ల కోసం వచ్చే వారి కోసం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నామని తహసీల్దార్లు చెబుతున్నారు.
కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు కలెక్టర్ ఆదేశానుసారం పనిచేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. కార్యాలయాల్లోకి వచ్చే వారికి శానిటైజర్‌తో పాటు మాస్కులు పెట్టుకునే విధంగా చర్యలు తీసుకుంటున్నామని.. తమ సూచనలు ప్రజలు పాటిస్తున్నారని వివరిస్తున్నారు.
కరోనా ఉద్ధృతి తగ్గే వరకు సాధ్యమైనంత మేర కార్యాలయాలకు నేరుగా రాకుండా ప్రత్యమ్నాయ మార్గాలు అనుసరిస్తే మేలని వివిధ శాఖల అధికారులు సూచిస్తున్నారు.